ఆర్టీసీ సమ్మెపై సర్కారు ఆలోచన
నేటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే చాన్స్
విచారణ లేటయితే ఆర్టీసీపై కొత్త పాలసీ అమలుకు ఇబ్బంది
అందుకే విధాన నిర్ణయం తీసుకుని చెప్తే బెటరన్న భావన
ఉద్యోగుల తగ్గింపు, ప్రైవేటు బస్సులు,
రూట్లపై కీలక నిర్ణయాలకు అవకాశం
ఏ డెషిషన్ తీసుకుంటారోనని కార్మికుల్లో టెన్షన్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్టుకు పంపొద్దన్న ఆలోచనకు సర్కారు వచ్చినట్టు సమాచారం. లేబర్ కోర్టుకు పంపాలంటే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని, కోర్టులో వాద, ప్రతివాదాలు విచారణకు ఐదారు నెలలకుపైగా టైం పడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానివల్ల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, అటు ప్రైవేటు బస్సులు, రూట్ల డీనోటిఫై, ప్రైవేటుకు అప్పగించడం వంటి నిర్ణయాల అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్లో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ విషయంగా తాము విధాన నిర్ణయం తీసుకున్నట్టుగా కోర్టుకు చెబితే సరిపోతుందన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు పేర్కొంటున్నాయి.
ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు చివరికి ఈ అంశాన్ని లేబర్ కోర్టే తేల్చాలని ఈ నెల 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సమ్మెపై లేబర్ కమిషనర్ రెండు వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని, దాని ఆధారంగా లేబర్‌కోర్టుకు పంపడంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ పంపకపోతే ఎందుకు పంపలేదన్న కారణాలతో రిపోర్టు అందజేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ లేబర్ కమిషనర్ గతవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. కోర్టు చెప్పిన గడువులో ఇప్పటికే పది రోజులు పూర్తయింది. ఇంకా ఐదు రోజులే టైముంది. దీంతో సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు రెఫర్ చేస్తే తలెత్తే సమస్యలేమిటన్న దానిపై సర్కారు ఆరా తీసింది. లేబర్ కోర్టుకు పంపితే సమస్యకు ఇప్పట్లో పరిష్కారం రాదని, అందుకని ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపితే ఎలా ఉంటుందని సీఎం ఆలోచనలో ఉన్నట్టు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం మేరకు.. సంస్థ, కార్మికుల మధ్య వివాదం తలెత్తినప్పుడు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రాజీ ప్రయత్నాలు చేయాలి. అక్టోబర్ 4న జాయింట్ కమిషనర్ ఇరువురిని పిలిచి సంప్రదింపులు జరిపారు. అయితే ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే కార్మికులు సమ్మెలోకి వెళ్లారని, అందుకే జాయింట్ కమిషనర్ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించారని ప్రభుత్వం చెప్తోంది. దీని ఆధారంగానే సమ్మె చట్ట విరుద్ధమని సీఎం అంటున్నారు. అయితే ఆ రిపోర్టును హైకోర్టు కొట్టేసింది.
కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ
గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం మొదలవుతుంది. ఇందులో ఏ నిర్ణయం వెలువడుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కేబినెట్ భేటీ కోసం ప్రధాన ఎజెండాగా ఆర్టీసీలోని వివిధ అంశాలను అధికారులు సిద్ధం చేశారు. కార్మికుల విషయంలో ఏం చేయాలన్న అంశంతోపాటు ప్రైవేటు బస్సుల పాలసీ, రూట్ల డీనోటిఫై చేయడంపై భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా సర్కారు దిగిరాలేదు. చివరికి కార్మికులే సమ్మె విరమించి, డ్యూటీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయినా ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ మాత్రం.. హైకోర్టు ఆదేశాల మేరకు లేబర్ కోర్టు నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా ఆగాల్సిందేనని ప్రకటించారు. అయితే ఇంతకాలం కొనసాగిన అనిశ్చితికి కేబినెట్ భేటీలో తెరపడుతుందా, కార్మికులపై ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఉద్యోగుల తగ్గింపు!
ఉద్యోగుల తగ్గింపుపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మెకు వెళ్లారని, ఆర్టీసీని నడిపే పరిస్థితి లేదని వాదిస్తూ వస్తున్న సర్కారు.. కార్మికులను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీం, లేదా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీంలలో ఏదో ఒక దానిని ప్రకటించే చాన్స్ ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వీఆర్ఎస్ ప్రకటిస్తే కార్మికులకు ఆప్షన్ ఉంటుందని, అదే సీఆర్ఎస్ ప్రకటిస్తే మాత్రం కార్మికులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని, కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని అంటున్నాయి.
‘ప్రైవేటు’ పాలసీలపైనా..
ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశంలో 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్సులను ఎలా తీసుకోవాలన్న దానిపై రవాణా శాఖ అధికారులు విధివిధానాలను సిద్ధం చేశారు. వాటికి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. రూట్లు దక్కించుకున్న సంస్థలు బస్సులను ఎలా నడపాలి, ఒకసారి రూట్ దక్కించుకుంటే ఎంతకాలం నడపాలి, ఎంత ఫీజు ఉంటుంది, నిబంధనలేమిటి, ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్న అంశాలు ఈ పాలసీలో ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఆర్టీసీకి మాత్రమే బస్సులు నడిపేందుకు హక్కున్న రూట్లను డీనోటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ఆస్తుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్?
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతమున్నట్టుగా దానిని కొనసాగించలేమని సర్కారు పలుమార్లు ప్రకటించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు, కార్మికుల వీఆర్ఎస్/సీఆర్ఎస్కు డబ్బుల కోసం ఆర్టీసీ ఆస్తులను విక్రయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పంపితే ఇప్పట్లో తేలదు!
ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు పంపాలనే నిర్ణయానికి వస్తే దాన్ని జీవో రూపంలో ఇవ్వాలి. ఏ అంశాలపై కోర్టుకు వెళ్లాలో అందులో పేర్కొనాలి. ఈ జీవో ప్రకారం లేబర్ కమిషనర్ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తారు. అటు కార్మికులు, ఇటు మేనేజ్ మెం ట్ వాదనలు విన్నాక కోర్టు తీర్పు ఇస్తుంది. ఇదంతా పూర్తవడానికి కనీసం ఆరు నెలల టైం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం కోసం కేబినెట్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కార్మికుల డిమాండ్లు సంస్థ పరిధిలో పరిష్కరిం చేవి కావని, విధానపరమైన అంశాలని ఆర్టీసీ మేనేజ్ మెం ట్ మొదటి నుంచీ చెప్తోం ది. విధానపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వ పరిధిలో ఉందని హైకోర్టుకు కూడా తెలిపిం ది. సర్కారు ఇప్పుడీ అంశాన్ని ఆసరాగా చేసుకుని.. విధానపరమైన డిమాండ్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, అందుకే లేబర్ కోర్టుకు పంపలేకపోయామని రిపోర్టు ఇస్తే సరిపోతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి .
కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ
కేబినెట్ భేటీలో కొత్త రెవెన్యూ చట్టంపైనా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కొత్త రెవెన్యూ చట్టం విషయాన్ని సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. చట్టంపై ఇప్పటికే నల్సార్ యూనివర్సిటీ బృందం కసరత్తు చేసిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ నోట్‌పై కేబినెట్లో చర్చ జరగొచ్చని అంటున్నాయి. చట్టానికి తుది రూపు, ఆమోదం కోసం మరోసారి కేబినెట్ సమావేశం కానుందని పేర్కొంటున్నాయి.

