
- మేధావులు, ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తే అమలుచేస్తం
- ఆదివాసీల నిధులను గత సర్కార్ పక్కదారి పట్టించిందని ఫైర్
- ఆదివాసీ ఉత్సవాలకు స్పీకర్‌గడ్డం ప్రసాద్‌తో కలిసి హాజరు
హైదరాబాద్, వెలుగు: గిరిజనులు, ఆదివాసీలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసినప్పటికీ... అనుకున్న స్థాయిలో వారికి అభివృద్ధి ఫలాలు దక్కలేదని మంత్రి సీతక్క అన్నారు. మేధావులు, ఉన్నాతాధికారులు ముందుకొచ్చి ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలను రచిస్తే అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. అధికారులు, మేధావులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు.
శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జంజారాహిల్స్ లోని కొమురం భీం ఆదివాసీ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. అతిథులకు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ యోధుడు రాంజీ గొండు భారీ చిత్రపటాన్ని స్పీకర్, మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, తాగునీరు వంటి మౌలిక సదుపాయలను అందించే విధంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ తీరు వల్ల ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాయని, ఐటీడీఏ పరిధిలో అమల్లో ఉన్న జీవో నంబర్ 3ను గత ప్రభుత్వం రద్దు చేసిన కారణంగా స్థానిక గిరిజనులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయాయని అన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి, ఆదివాసీలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
బడ్జెట్లో 17 వేల కోట్లు కేటాయించినం
గిరిజనులు, ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 17 వేల కోట్ల నిధులను కేటాయించిందని మంత్రి సీతక్క తెలిపారు. అందులో ప్రతి రూపాయిని ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో వెచ్చించి ప్రజల అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు అటవీ భూముల మీద హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే .. ఆ చట్టానికి తూట్లు పొడిచేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన: స్పీకర్ గడ్డం ప్రసాద్
సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ పాలన అందిందని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతున్నదని తెలిపారు. ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఇంటి దాకా తెచ్చిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ‘‘నాకు 8 మంది అక్కాచెల్లెళ్లు. మంత్రి సీతక్క తొమ్మిదవ సిస్టర్” అని తెలిపారు. రామచంద్రు నాయక్, మురళి నాయక్, బెల్లయ్య నాయక్, ఆత్రం సుగుణ, శరత్, మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ పూజారులు పాల్గొన్నారు.