మామ చెప్పినట్టే..! కాళేశ్వరం కమిషన్కు హరీశ్ అఫిడవిట్ ? అసెంబ్లీలో చదివి వినిపించిన సీఎం రేవంత్

మామ చెప్పినట్టే..! కాళేశ్వరం కమిషన్కు హరీశ్ అఫిడవిట్ ? అసెంబ్లీలో చదివి వినిపించిన సీఎం రేవంత్
  • 665 పేజీల నివేదికలో ఈ మాటలున్నది పేజీ నంబర్ 65లో
  • విచారణను సీబీఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్ర ప్రజల్లో ఏం జరగబోతోందనే ఉత్కంఠ

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట  మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు అధికారులు, ఇంజినీర్లు మాత్రమే కేసీఆర్ చెప్పినట్టు చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు కూడా తనకేమీ తెలియదన్నట్టుగా సమాధానం చెప్పారని సీఎం అన్నారు. ఈ విషయాన్ని నిన్న  రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించడం సంచలనం రేకెత్తించింది.

665  పేజీల ఈ నివేదికలో హరీశ్ రావు ఇచ్చిన అఫిడవిట్ను కూడా ఉన్నదని  సీఎం తెలిపారు. తాను ఒత్తిడి మేరకే సంతకం చేశానని చెప్పినట్టు సీఎం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపే బాధ్యతను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నట్టు వెల్లడించారు.

ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో, వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఫీఎఫ్ సీ ,ఆర్ ఈ సీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున ఈ కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని, అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంటున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్నో రకాలైన అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండటం వల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించడం జరిగింది. నిజాయితీతో కూడిన విచారణ జరగాలని కోరుకుంటున్నాం’’అని సీఎం అన్నారు.

ఈ నేపథ్యంలో  సీబీఐ రంగంలోకి దిగితే ఏం జరుగబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు నుంచి హరీశ్ రావు తప్పించుకుంటారా..?  ఎలా తప్పించుకుంటారు..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిజైనింగ్, ఇంజినీరింగ్, నిర్మాణ వైఫల్యాలను మూటగట్టుకొన్న ఈ ప్రాజెక్టు అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చనీయంశంగా మారింది.