- కేంద్రానికి వరుసపెట్టి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు
- ఐటీఐఆర్ సహా పెండింగ్ ప్రాజెక్టులు
- చేపట్టాలని నిర్మలా సీతారామన్, పీయూష్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
- నీతి ఆయోగ్ సిఫార్సులకు కార్యరూపమివ్వాలని హరీశ్ వినతి
- మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న సత్యవతిరాథోడ్
- ఇదే జాతరకు సాయం చేయాలని ఎమ్మెల్సీ కవిత ట్వీట్
- రైల్వే ప్రాజెక్టులకు నిధులు కావాలన్న వినోద్‌కుమార్
హైదరాబాద్, వెలుగు: వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్ద పీట వేయాలని, నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రులు వరుసగా విన్నవిస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్వరుసగా లేఖలు రాశారు. ఐటీఐఆర్ సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు కూడా నిర్మలా సీతారామన్‌కు నిధుల అంశంపై విజ్ఞప్తి చేశారు. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటులో తెలంగాణకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ విన్నవించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మొత్తంగా రూ. 60 వేల కోట్లు దాకా రాష్ట్రానికి కావాలని ఇప్పటివరకు రాసిన లేఖల్లో రాష్ట్ర మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్, ఇండస్ట్రీస్ శాఖలకు రూ.22,757 కోట్లు
మున్సిపల్, ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో చేపట్టే ప్రాజెక్టులకు 2022–-23 బడ్జెట్‌లో రూ. 22,757 కోట్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు లెటర్లు రాశారు. ఇందులో మున్సిపల్ ప్రాంతాల్లో ప్రజారవాణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపడుతున్న ప్రాజెక్టులకు రూ. 7,800 కోట్లు ఇవ్వాలన్నారు. చేనేత, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు ఇంకో రూ. 954.96 కోట్లు కేటాయించాలని కోరారు. ఫార్మాసిటీ సహా ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 14 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా.. టెక్స్‌టైల్ పరిశ్రమకు చేయూతనివ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను
కోరుతూ మరో లేఖ రాశారు.
నీతి ఆయోగ్ సిఫార్సులు అమలుచేయాలి
మిషన్ భగీరథకు రూ. 19వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5205 కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులకు కార్యరూపం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.
2019–-20తో పోల్చితే 2020–--21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని, తగ్గే వాటాకు ప్రత్యామ్నాయంగా రూ. 723 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం తిరస్కరించిందని, గతంలో ఎప్పుడూ ఇలా ఆర్థిక సంఘం సిఫార్సులు తిరస్కరించిన సందర్భాలు లేవన్నారు. కేంద్రం వెంటనే ఈ నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణకు రావాల్సిన రూ. 495.20 కోట్లు పొరపాటున ఏపీకి విడుదల చేశారని, వాటిని తిరిగి విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ. 210 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు రూ. 817.61 కోట్లు ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయాలన్నారు. బీఆర్‌జీఎఫ్ పెండింగ్ బకాయిలు రూ. 900 కోట్లు ఇవ్వడంతో పాటు 2021 –- 22 ఆర్థిక సంఘం నుంచి మరో ఐదేండ్ల పాటు ఈ గ్రాంట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైల్వే లైన్లు మంజూరు చేయండి
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన 11 రైల్వే లైన్లు వచ్చే బడ్జెట్‌లో మంజూరు చేయాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. వీటికి అదనంగా మరో 25 కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ –- మానకొండూర్-– హుజూరాబాద్ -– కాజీపేట, మంచిర్యాల –- ఆదిలాబాద్, మణుగూరు –- భూపాలపల్లి -– రామగుండం, నంద్యాల –- జడ్చర్ల, కోయగూడెం –- తడికలపూడి, భద్రాచలం రోడ్ – - విశాఖపట్నం, హైదరాబాద్ –- శ్రీశైలం, సిద్దిపేట –- అక్కన్నపేట్, వాషిం -– ఆదిలాబాద్, పటాన్‌చెరు -– సంగారెడ్డి, పగిడిపల్లి బైపాస్ లైన్‌లు మంజూరు చేయాలన్నారు. వీటికి కనీసం రూ.10 వేల కోట్లకు పైగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులివ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరకు ఇప్పటికే రూ. 332.71 కోట్ల నిధులు వెచ్చించిందని, ఈ మేరకు కేంద్రం కూడా సాయం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
లిస్టులో టాప్ ప్రయారిటీ ప్రాజెక్టులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్తున్న అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం కోరుతున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, మూసీ రివర్ ఫ్రంట్, ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్లు, వరంగల్ మెట్రో నియో రైల్ ప్రాజెక్టు, ఎస్టీపీలు, మిస్సింగ్ లింక్ రోడ్లు, హైదరాబాద్ మోనో రైల్, మూసీ స్కైవే, వరంగల్ మెగా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్, ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లు, క్లస్టర్లు, డిఫెన్స్ ఇండస్ట్రీ సహా ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులివ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతున్నది కాబట్టి కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని మంత్రులు లేఖల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేటీఆర్ కోరారు. హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి రక్షణరంగానికి సంబంధించిన స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆదుకోవడంతో పాటు భూముల బదలాయింపు, ప్రాజెక్టుల మంజూరు విషయంలో అండగా నిలువాలని లేఖల్లో కోరారు.
భారీ ఎత్తున నిధులిచ్చి ఆదుకోవాలని కేంద్ర సర్కారును రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. ఇదే అంశంపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ నాలుగు లేఖలు, మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ తలా ఒకటి చొప్పున లేఖలు రాశారు.