లోన్‌‌ రికవరీ కోసం అనాథ బాలికకు ఎల్‌‌ఐసీ నోటీసులు

లోన్‌‌ రికవరీ కోసం అనాథ బాలికకు ఎల్‌‌ఐసీ నోటీసులు
  • కరోనాతో తల్లీదండ్రులను కోల్పోయిన బాలిక
  • తండ్రి జీతేంద్ర తీసుకున్న హోంలోన్​ కట్టాలని ఒత్తిడి
  • జీతేంద్ర స్వయంగాఎల్​ఐసీ ఏజెంటే
  • ఆయనకివ్వాల్సిన కమీషన్లు బ్లాక్​ చేసిన ఎల్​ఐసీ అధికారులు

న్యూఢిల్లీ: నాన్న.. ఎల్‌‌ఐసీ ఏజెంట్. కరోనాతో అమ్మానాన్నలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. పిల్లలిద్దరూ అనాథలయ్యారు. తండ్రికి సంబంధించిన సేవింగ్స్‌‌ను, నెలనెలా రావాల్సిన కమీషన్లను టెక్నికల్ కారణాలతో ఎల్‌‌ఐసీ బ్లాక్ చేసింది. చిల్లిగవ్వ లేక ఇంకొకరి ఆసరాతో బతుకుతున్నారు పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి లోన్ కట్టాలంటూ పదేపదే నోటీసులు పంపుతున్నది ఎల్‌‌ఐసీ. దీంతో సంస్థకు లేఖ రాసిందా అమ్మాయి. ‘‘నేను మైనర్‌‌‌‌ననే కారణంతో.. మా నాన్నకు సంబంధించి రావాల్సినవన్నీ బ్లాక్ చేశారు. ఇప్పుడేమో ‘నేను మైనర్‌‌‌‌ను లోన్ చెల్లించలేను’ అని చెప్పినా పదేపదే నోటీసులు పంపుతున్నారు. కాస్త టైమివ్వండి. 18 ఏండ్లు నిండాక కడుతాను’ అని చెప్పుకొచ్చిందా అమ్మాయి.
లీగల్‌‌ యాక్షన్‌‌కు సిద్ధంగా ఉండాలంటూ..
భోపాల్‌‌కు చెందిన జీతేంద్ర పాథక్.. తాను పని చేస్తున్న ఎల్‌‌ఐసీ నుంచి గతంలో హోమ్ లోన్ తీసుకున్నారు. అయితే కరోనాతో 2021 మే నెలలో జీతేంద్ర, ఆయన భార్య సీమా పాథక్ చనిపోయారు. దీంతో 17 ఏళ్ల వనీశ, ఆమె తమ్ముడు వివన్ అనాథలయ్యారు. వీళ్లిద్దరూ మైనర్లు కావడంతో జీతేంద్రకు సంబంధించిన అన్ని సేవింగ్స్, నెలనెలా రావాల్సిన కమీషన్లను బ్లాక్ చేసింది సంస్థ. ప్రస్తుతం వారిద్దరూ తమ అంకుల్ అశోక్ శర్మ దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో హోమ్‌‌ లోన్ కట్టాలంటూ ఎల్‌‌ఐసీ నోటీసులు పంపింది. రూ.29 లక్షలను కట్టాలంటూ చివరిసారిగా ఫిబ్రవరి 2న ఫైనల్ నోటీసు పంపింది. తాము తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారం బయటికి రావడంతో స్పందించిన ఎల్‌‌ఐసీ డెవలప్‌‌మెంట్ ఆఫీసర్ సంజయ్ బర్న్‌‌వాల్.. వనీశ అప్లికేషన్‌‌ను సెంట్రల్ ఆఫీసుకు పంపినట్లు చెప్పారు. వనీశకు 18 ఏండ్లు వచ్చే దాకా ఎలాంటి నోటీసులు పంపబోమని వారికి తెలియజేసినట్లు తెలిపారు. 

స్పందించిన కేంద్ర మంత్రి
వనీశ ఎదుర్కొంటున్న సమస్యపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. చర్యలు తీసుకోవాలని డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్‌‌ఐసీని ఆదేశించారు.