అదానీ గ్రూప్‌‌‌‌లో ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు జూమ్‌‌‌‌ .. ఏడాదిలోనే 59 శాతం రిటర్న్‌‌‌‌

అదానీ గ్రూప్‌‌‌‌లో ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు జూమ్‌‌‌‌ .. ఏడాదిలోనే 59 శాతం రిటర్న్‌‌‌‌
  • 2023-24 లో రూ. 22,378 కోట్ల లాభాన్ని చూసిన ఇన్సూరెన్స్ కంపెనీ

న్యూఢిల్లీ: కిందటి ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్‌‌‌‌ కంపెనీల్లో చేసిన ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు 59 శాతం రిటర్న్ ఇచ్చాయి. హిండెన్‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌‌‌‌ నష్టాల నుంచి అదానీ గ్రూప్ షేర్లు రికవరీ అవుతున్న విషయం తెలిసిందే. ఏడు అదానీ గ్రూప్  కంపెనీల్లో  ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడుల విలువ 2023 మార్చి 31 నాటికి రూ.38,471 కోట్లు ఉంటే  2024 మార్చి 31 నాటికి రూ.61,210 కోట్లకు చేరుకున్నాయి.  ఏకంగా రూ.22,378 కోట్ల లాభాన్ని ఇచ్చాయి. హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌తో అదానీ గ్రూప్‌‌‌‌ కంపెనీల షేర్లు ఏకంగా 7‌‌‌‌‌‌‌‌0 శాతం వరకు పతనమయ్యాయి. 

అప్పుడు ఎల్‌‌‌‌ఐసీ ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. పొలిటికల్‌‌‌‌ ప్రెజర్ వలన అదానీ  పోర్ట్స్ అండ్ సెజ్‌‌‌‌, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌లో తన పెట్టుబడులను ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ రెండు కంపెనీల షేర్లు కిందటి ఆర్థిక సంవత్సరంలో 83 శాతం వరకు పెరిగాయి.  పొలిటికల్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌తో  డొమెస్టిక్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐ) వెనకడగు వేసినా, ఫారిన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐ)  మాత్రం  అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాయి. ఖతర్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అథారిటీ,  అబు దాబికి చెందిన ఐహెచ్‌‌‌‌సీ, ఫ్రెంచ్ కంపెనీ టోటల్‌‌‌‌ఎనర్జీస్‌‌‌‌, యూఎస్ కంపెనీ జీక్యూజీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కలిసి రూ.45 వేల కోట్లను అదానీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేశాయి. 

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌లో ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు  2023–2024 లో రూ.8,495.31 కోట్ల నుంచి రూ. 14,305.53 కోట్లకు, అదానీ పోర్ట్స్‌‌‌‌లో రూ.12,450.09 కోట్ల నుంచి రూ.22,776.89 కోట్ల పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలోని పెట్టుబడులు రెండింతలకు పైగా పెరిగి రూ.3,937.62 కోట్లకు చేరుకున్నాయి. అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌, అంబుజా సిమెంట్స్‌‌‌‌, ఏసీసీలోని  ఎల్‌‌‌‌ఐసీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి.