నా ఆరోగ్యం బాగలేదు.. శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద లేఖ

నా  ఆరోగ్యం బాగలేదు..  శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద లేఖ

దేశం నుంచి పారిపోయి స్వయంగా  కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి ఆరోగ్యం విషమంగా ఉంది. తనకు వైద్య చికిత్స అందించాలంటూ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు నిత్యానంద లేఖ రాశారు. ఆగస్టు 7న రాసిన ఈ లేఖను  నిత్యానంద తరఫున శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి రాశారు. దీంతో పాటు నిత్యానందకు అందించే వైద్యచికిత్సకు ఎంత ఖర్చయినా తాము భరిస్తామని ఆ లేఖలో కైలాస దేశ మంత్రి పేర్కొన్నారు. నిత్యానందను ఎయిర్ అంబులెన్స్‌లో కొలంబో తరలిస్తామని, అనంతరం వైద్య పరికరాలను మీకే ఇచ్చేస్తామని, ఆ తర్వాత మళ్లీ శ్రీలంకను విడిచి వెళ్లిపోతామని ఆ లేఖలో తెలిపారు.

కైలాస దేశంలో వైద్య వసతుల కొరత ఉందని... నిత్యానంద అనారోగ్యం వెనక ఉన్న కారణాలేంటో డాక్టర్లు ఇంకా గుర్తించలేదని లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని... అత్యవసర చికిత్స అందించాలని.. ఆయన అనుచరులు శ్రీలంకలో కేవలం రాజకీయ ఆశ్రయం మాత్రమే కాకుండా వైద్య సాయం కూడా కోరుతున్నారని రణిల్ విక్రమసింఘేకు రాసిన లేఖలో అభ్యర్థించారు. వీటితో పాటుకైలాస దేశంతో శ్రీలంక దౌత్య సంబంధాలను ప్రారంభించాలని ఆ లేఖలో కోరారు. తమకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తే.. నిత్యానంద శ్రీలంకలో పెట్టుబడులు పెడతారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

నిత్యానంద తన ఇద్దరు శిష్యులను కిడ్నాప్ చేశారని అప్పట్లో గుజరాత్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో 2018 నవంబర్‌లో ఆయన దేశం నుంచి పారిపోయారు. చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని విరాళాలు సేకరించారనే ఆరోపణలతో పాటు, ఆయనపై కర్ణాటకలో రేప్ అభియోగాలు కూడా ఉన్నాయి. 2010 నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఆయనపై రేప్ అభియోగం నమోదు చేశారు. వీటన్నింటి కారణంగా ఆయన దేశం విడిచి పారిపోయారు.