ములుగు జడ్పీ చైర్మన్‌‌‌‌కు స్ట్రోక్.. సీపీఆర్ చేసి కాపాడిన భార్య

ములుగు జడ్పీ చైర్మన్‌‌‌‌కు స్ట్రోక్.. సీపీఆర్ చేసి కాపాడిన భార్య
  • కార్డియాక్ అరెస్ట్‌‌‌‌తో పడిపోతున్న వారిని కాపాడుతున్న జనం
  • ములుగు జడ్పీ చైర్మన్‌‌‌‌కు స్ట్రోక్.. సీపీఆర్ చేసి కాపాడిన భార్య
  • ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను రక్షించిన 108 సిబ్బంది
  • పోలీసులు, ఉద్యోగులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్న ఆరోగ్య శాఖ
  • రాష్ట్రంలో ఏటా 24 వేల మందికి కార్డియాక్ అరెస్ట్‌‌‌‌

ఏటూరునాగారం, కొండపాక, హైదరాబాద్, వెలుగు: సీపీఆర్‌‌‌‌ (కార్డియో పల్మనరీ రెససిటేషన్)పై పెరుగుతున్న అవగాహన.. ప్రాణాలను నిలుపుతున్నది. కార్డియాక్ అరెస్ట్‌‌తో కుప్పకూలుతున్న వారికి జనాలు సకాలంలో సీపీఆర్ చేసి కాపాడుతున్నారు. ములుగు జడ్పీ చైర్మన్‌‌ కుసుమ జగదీశ్వర్ కార్డియాక్‌‌ అరెస్ట్‌‌తో శనివారం ఇంట్లోనే కుప్పకూలగా.. ఆయన భార్య రమాదేవి వెంటనే సీపీఆర్‌‌‌‌ చేయడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. జగదీశ్వర్ ప్రస్తుతం హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నారు. శుక్రవారం హైదరాబాద్ హయత్‌‌నగర్‌‌‌‌లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి రామన్నపేట సీఐ మోతీరాం సీపీఆర్ చేసి కాపాడారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద గురువారం ఓ ఆటోడ్రైవర్‌‌‌‌ కార్డియాక్ అరెస్ట్‌‌తో కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్న అంబులెన్స్‌‌ను స్థానికులు ఆపడంతో.. మెడికల్ టెక్నీషియన్లు మహేందర్‌‌‌‌రాజు, రమేశ్‌‌ సీపీఆర్ చేసి ఆటో డ్రైవర్‌‌‌‌ను కాపాడారు. తర్వాత అదే అంబులెన్స్‌‌లో హాస్పిటల్‌‌కు తరలించారు. ఈ ఘటనల్లో సీపీఆర్‌‌‌‌ చేసిన వారిని అభినందిస్తూ మంత్రి హరీశ్‌‌రావు ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్ కేసులు బాగా పెరిగాయి. దీంతో సీపీఆర్‌‌ చేయడం ఎలాగో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ఆరోగ్య శాఖ ట్రైనింగ్ ఇప్పిస్తున్నది. కొంత మంది డాక్టర్లు సైతం స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు పెట్టి స్టూడెంట్స్‌‌కు ట్రైనింగ్ ఇస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

దేశంలో రోజూ 4 వేల కేసులు

మన దేశంలో రోజూ సగటున 4 వేల మంది కార్డియాక్ అరెస్ట్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క తెలంగాణలోనే ఏటా 24 వేల మంది కార్డియాక్ అరెస్ట్‌‌తో కుప్పకూలుతున్నారు. సకాలంలో సీపీఆర్‌‌‌‌ చేస్తే ఇందులో కనీసం సగం మందిని కాపాడగలుగుతామని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మన దేశంలో నూటికి పది శాతం మందికి కూడా సీపీఆర్ మీద అవగాహన లేదు. దీంతో కార్డియాక్ అరెస్ట్ బారిన పడిన వారిలో 90 శాతం మంది స్పాట్‌‌లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు సీపీఆర్‌‌‌‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన రాష్ట్రంలో లక్ష మందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చే లక్ష్యంతో ఇటీవలే ఆరోగ్యశాఖ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. సీపీఆర్‌‌పై ఇంకా అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.

కార్డియాక్ అరెస్ట్ అంటే?

సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కానీ డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం అవి రెండూ వేర్వేరు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైకలాజికల్‌‌గా, ఫిజికల్‌‌ షాక్‌‌కు గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుంది. దీన్నే సడెన్ కార్డియాక్ అరెస్ట్‌‌గా పేర్కొంటారు. 

ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి

రాష్ట్రంలో ఏటా 24 వేల మంది కార్డియాక్ అరెస్ట్‌‌కు గురవుతున్నారు. సకాలంలో సీపీఆర్ చేస్తే ఇందులో సగం మందిని కాపాడుకోవచ్చు. రాష్ట్రంలో లక్ష మందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇప్పించే లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేయడం ఎలాగో నేర్చుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇప్పించాలి. అసలు ఇంత మంది కార్డియాక్ అరెస్ట్‌‌ బారిన పడడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. గుండె జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.
-హరీశ్‌‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి