
సూర్యాపేట, వెలుగు: పెరోల్ పై వచ్చి ఆరేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న జీవిత ఖైదీని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్పీ నరసింహ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మఠంపల్లికి చెందిన బొడ్డు తిరుపతి 2012లో హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసి చర్లపల్లి జైలులో జీవితఖైదును అనుభవిస్తున్నాడు.
2019 ఆగస్టు17న అతడు 30 రోజుల పెరోల్ పై విడుదల అయ్యాడు. తిరిగి వెళ్లకుండా ఆరేండ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ నివేదిక ఆధారంగా మఠంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నాలజీ ఆధారంగా గుంటూరులో తిరుపతి ఉన్నట్లు గుర్తించి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి టీమ్ వెళ్లి అరెస్ట్ చేసింది.
నిందితుడు పేరు మార్చుకుని కుటుంబం, బంధువులతో సంబంధాలు లేకుండా జీవిస్తున్నట్లు తేలింది. గుంటూరులోని ఓ హోటల్లో పని చేస్తూ, స్థానికంగా ఓ మహిళను పెండ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. నిందితుడిని గుర్తించి పట్టుకోవడంలో ప్రతిభచూపిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.