'లైగర్'.. పంచ్‌ మిస్సయ్యింది

'లైగర్'.. పంచ్‌ మిస్సయ్యింది

రౌడీ హీరోని వెండితెర మీద చూసి రెండేళ్లు దాటింది. దాంతో ‘లైగర్’ కోసం అతని అభిమాన గణం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. హీరో ఇమేజ్‌ని అమాంతం లేపే సత్తా ఉన్న పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడం, విజయ్‌కి మొదటి బాలీవుడ్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ‘లైగర్’ పంచ్ ఎలా ఉంది? నచ్చేలా ఉందా లేదా? అనే విషయానికొస్తే....

కథేమిటంటే....

మిక్స్డ్‌ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ కొడుకు లైగర్ (విజయ్). తండ్రి ఓ పోటీలో తలపడుతూ చనిపోవడంతో అతను సాధించలేకపోయిన విజయాన్ని కొడుకు ద్వారా సాధించాలనుకుంటుంది విజయ్ తల్లి (రమ్యకృష్ణ). తన భర్త చివరిగా పోటీ పడిన క్రిస్టఫర్‌‌ (రోనిత్ రాయ్) దగ్గరకు తీసుకెళ్లి తన కొడుకుని చాంపియన్‌ని చేయమని అడుగుతుంది. అతను సరే అంటాడు. అయితే తానియా (అనన్య) ప్రేమలో పడి లైగర్ కాస్త గాడి తప్పుతాడు. తనకి నత్తి ఉందని తెలిసి తానియా వదిలేసి వెళ్లిపోవడంతో డిప్రెస్ అవుతాడు. కానీ తల్లి ఇచ్చిన స్ఫూర్తితో తిరిగి లేస్తాడు. నేషనల్‌ చాంపియన్‌ అవుతాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని ఆశపడతాడు. ఆ క్రమంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా అధిగమించి లక్ష్యాన్ని సాధించాడనేదే అసలు కథ.

ఎలా ఉందంటే..

మార్షల్ ఆర్ట్స్ అనేది మనవాళ్లకి కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. తమ్ముడు, అమ్మ నాన్న తమిళమ్మాయి, గురు, గని లాంటి చాలా సినిమాలు ఇప్పటికే చూసేశారు. కానీ పూరి తీస్తున్నాడు కాబట్టి, విజయ్ యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ‘లైగర్’లో ఏదో విషయం ఉండి ఉంటుంది అనుకున్నారంతా. అలా అనుకుని సినిమాకి వెళ్తే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ప్రోమోలు చూసి చాలామంది ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలా ఉందంటూ కామెంట్ చేశారు. కానీ కాదు. ఎందుకంటే ఆ సినిమాలో బలమైన పాయింట్ ఉంటుంది. కట్టిపడేసే ఎమోషన్ ఉంటుంది. అందమైన పోరాటం ఉంటుంది. హత్తుకునే ప్రేమ ఉంటుంది. ఇవేమీ ఈ సినిమాలో లేవు. కాబట్టి ‘లైగర్‌‌’ని ఆ సినిమాతో పోల్చడం తప్పే అవుతుంది. 

ఏ మాత్రం పసలేని డైలాగ్స్...

ఎక్కడో కరీంనగర్‌‌ నుంచి కాఫీ కొట్టు పెట్టుకోడానికి వచ్చిన తల్లీ, కొడుకుల్ని చూసి ఏదో స్ట్రగుల్ ఉందనుకుంటాం. కోచ్ దగ్గరికి వెళ్లి తల్లి చెప్పే ఎమోషనల్ డైలాగ్ చూసి సినిమా ఎక్కడికో వెళ్లిపోతుందనుకుంటాం. కానీ ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదు. ఎప్పుడో చూసినట్టు ఉండే సీన్స్, ఏమాత్రం పసలేని డైలాగ్స్, ఎందుకురా బాబూ ఇవన్నీ అనిపించే జోక్స్.. మధ్యలో హీరో నత్తి. ప్రతి డైలాగ్‌నీ పదిసార్లు ఒత్తి పలుకుతుంటే మొదట్లో ఏమీ అనిపించకపోయినా ఉండే కొద్దీ విసుగు పుడుతుంది. చాంపియన్ అవ్వాలనుకునేవాడిలో ఉండే కసి హీరోలో లేదు. అసలు అతను రింగ్‌లోకి దిగడానికి అవసరమైన ఎమోషనల్ కనెక్టే కనిపించదు. ఎంతో కష్టపడి ఫైట్స్ చేస్తున్నా అతని స్ట్రగుల్ దేనికనే క్లారిటీ ప్రేక్షకుడికి లేకపోవడంతో కథలో ఇన్‌వాల్వ్ అయ్యే అవకాశమే దొరకదు. ఇలా పడుతూ లేస్తూ సాగిన ప్రథమార్థాన్ని భరించేసినా.. ఏమైనా ఉంటుందేమో అని ఆశించిన సెకెండాఫ్ అంతకుమించి ఉసూరనిపించేసరికి ఆశలు వదిలేసుకోక తప్పని పరిస్థితి. చివరికి మైక్ టైసన్ వచ్చి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమోనని చూస్తే అదీ వర్కవుట్ కాలేదు. ఇందుకోసమేనా అంత పెద్ద చాంపియన్‌ని పట్టుకొచ్చింది అని ఫీలవడం తప్ప చేసేదేమీ లేదు. 

విజయ్ ఈ సనిమాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో...

ఒకసారి చూసేసిన కాన్సెప్ట్ ని తీసుకోవడమే రిస్క్. కానీ ఎన్నో సినిమాల్లో చూసేసినదాన్ని తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి పాపులర్ హీరోతో సినిమా తీసేటప్పుడు ఎంత కేర్ తీసుకోవాలి! ఎంతమంది ఆశల్ని, అంచనాల్ని మనసులో ఉంచుకోవాలి! పూరి అలా ఎందుకు చేయలేదో అర్థం కాదు. కనీసం ఆయన గత సినిమాల్లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ గానీ, కామెడీ గానీ, అదిరిపోయే డైలాగ్స్ గానీ ఏమీ లేవు. ఇక హీరోయిన్ ఎపిపోడ్ అయితే ఇరిటేట్ చేస్తుంది. అదేం ప్రేమో, దానివల్ల సినిమాకి ఒరిగిందేమోటో అర్థం కాదు. పైగా ఆమెతో పాటు ఒకట్రెండు క్యారెక్టర్లు వేరే భాషలో డైలాగ్స్ చెప్పుకోవడం వల్ల ఆ లిప్ మూమెంట్ చూసి మరింత చిరాకొస్తుంది. చెప్పుకోడానికి ఒక్కటైనా ఇంట్రెస్టింగ్ సీన్ లేని ఇలాంటి సినిమాని ఆయన ఎలా ప్లాన్ చేశారో, దానికి విజయ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో తెలియని కన్‌ఫ్యూజన్‌లోనే ప్రేక్షకుడు చివరి వరకూ ఉంటాడు. అలాగే బైటికి వచ్చేస్తాడు.  

ప్లస్సులూ..  మైనస్సులూ..

ఏ సినిమాకైనా ప్లస్సులూ, మైనస్సులూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తప్ప మరే ప్లస్సూ లేదు. హీరో క్యారెక్టరయిజేషన్‌లో సత్తా లేకపోయినా తన ఈజ్‌తో, గ్లామర్‌‌తో, స్టైల్‌తో, ఎనర్జీతో దాన్ని పైకి లేపేందుకు చాలా ప్రయత్నించాడు. ఫైటర్‌‌గా లుక్స్ పరంగానూ మెస్మరైజ్ చేశాడు. కానీ అదొక్కటే చాలదు కదా సినిమా సక్సెస్ కావడానికి. అందుకే అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అనన్యా పాండే పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. పైగా ఇబ్బంది పెడుతుంది. సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ఆమె చేసే చీప్ ట్రిక్స్, ఒక్క ఫైట్ చూసి హీరో వెంట పడిపోయే ప్రేమ ఏమాత్రం రుచించవు. దానికి తోడు ఆమె పర్‌‌ఫార్మెన్స్ కూడా వీక్‌గానే ఉంది. ఇక పూరి సినిమాల్లో ఉండే రెగ్యులర్ మదర్ పాత్రలోనే రమ్యకృష్ణ నటించారు. శివగామి లాంటి పాత్రలు చేసిన ఆమెకి ఇదో లెక్క కాదు. దీని వల్ల ఆమెకి కానీ, ఆమె పాత్ర వల్ల సినిమాకి గానీ కలిసొచ్చిందేమీ లేదు. పైగా కొన్ని  సీన్స్ లో ఆమె లౌడ్‌గా అనిపించడం మైనస్ కూడా. కోచ్‌గా రోనిత్‌ రాయ్ తనవంతు న్యాయం చేశారు. అయితే ఆయనలోని మంచి నటుడికి తగ్గ పాత్ర కాదిది. అలీ, గెటప్‌ శ్రీను, విషురెడ్డి, టెంపర్ వంశీల పాత్రలు అంతంతమాత్రం. చుంకీ పాండే గురించి చెప్పుకోడానికేమీ లేదు. 

మొత్తానికి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారుగా..

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ఎక్కువమంది సంగీత దర్శకులు పని చేయడం వల్లో ఏమో.. పాటలన్నీ రకరకాలుగా ఉన్నాయి. కొన్ని వినడానికి బానే ఉన్నా గుర్తుండిపోయేవైతే కాదు. ఒక రకంగా ఈ సినిమాకి పాటలు అనవసరం కూడా. అసలే నీరసంగా సాగుతున్న కథకి అవన్నీ అడ్డు తగిలినట్టనిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కానీ పూర్తి మార్కులు వేయలేం. సినిమాటోగ్రఫీకి మార్కులు పడతాయి. నిజానికి కథ, కథనాలు బాగుంటే మిగతా టెక్నికాలిటీస్‌ అన్నీ మరింత బాగుండే ఛాన్స్ ఉంటుంది. అవే సరిగ్గా లేనప్పుడు ఇక మిగతావాటి గురించి చెప్పుకోవడం అనవసరమేమో. రొటీన్‌ కథ.. బిగి లేని స్క్రీన్‌ప్లే.. పస లేని డైలాగ్స్.. అన్నీ కలిసి ‘లైగర్‌‌’ని పూర్‌‌ సినిమాగా మిగిల్చేశాయి. క్యారెక్టరైజేషన్స్ని తీర్చిదిద్దడంలో ఎక్స్ పర్ట్ అయిన పూరీ కనీసం వాటిని కూడా సరిగ్గా చూసుకోకుండా చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. అభిమానుల ఆశల మీద ఎంతగా నీళ్లు చల్లేశారో!

ఓవరాల్ గా 'లైగర్'.. పంచ్‌ మిస్సయ్యింది


నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషురెడ్డి, మైక్ టైసన్ తదితరులు
సంగీతం: విక్రమ్, తనిష్క్ బాగ్చీ, లియో జార్జ్, డీజే చీతాస్, సునీల్ కశ్యప్, జానీ
బ్యాగ్రౌండ్‌ స్కోర్: సునీల్ కశ్యప్
నిర్మాణం: పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్