వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుతో 35 గొర్రెలు, మేకలు, 3 ఎద్దులు చనిపోయాయి. మండలంలోని ఆలుబాక గ్రామానికి చెందిన పశువుల కాపరులు మజ్య చిన్నక్క, పూనెం నరసింహారావు మేకలు, గొర్రెల మందను మేత కోసం గ్రామ శివార్లలోని అడవికి తీసుకెళ్లారు.
సాయంత్రం ఇంటికి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గొర్రెల మంద సమీపంలోని చెట్టు కింద గుమికూడగా, పిడుగు పడడంతో 35 గొర్రెలు చనిపోయాయి. గొర్రెల కాపరులు స్పృహ కోల్పోగా వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ యుధిష్టర్ తెలిపారు. బర్రెబంద గ్రామంలో మూడు ఎద్దులు మృతి చెందాయి.
