- త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్
- రూ.13,006 కోట్లతో రోడ్ల నిర్మాణం.. స్పీడ్ అందుకున్న ప్రక్రియ
రాష్ట్రంలో ఆర్అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్రోడ్ల పనులకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 34 ప్యాకేజీలకుగానూ 90కిపైగా టెండర్లు దాఖలయ్యాయి. జాతీయస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న 27 కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ( ఆర్ అండ్ బీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్రోడ్ల పనులకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 34 ప్యాకేజీలకుగానూ 90కిపైగా టెండర్లు దాఖలయ్యాయి. జాతీయస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న 27 కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. హ్యామ్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు టెండర్లు వేసిన సంస్థల అర్హతలు, కంపెనీల స్టేటస్ రిపోర్ట్‌లాంటి పూర్తి వివరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు తెరిచి వర్క్ అగ్రిమెంట్లు చేసుకుంటామని సర్కారు ఇంజినీర్లు తెలిపారు.
32 జిల్లాలు.. 441 రోడ్లు
రోడ్ల నిర్మాణానికి సంబంధించి జాతీయస్థాయిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఏఐ)తో పాటు 11 రాష్ట్రాల్లో విజయవంతంగా చేపట్టిన హైబ్రీడ్యాన్యుటీ మోడల్(హ్యామ్)ను రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ తరఫున 32 జిల్లాల పరిధిలో రూ.13,006 కోట్లతో 441 రోడ్లను బాగుచేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6,092.37 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి నిరుడు జూన్ నెలలో జీవో జారీ చేశారు. రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు గల పనులను ఒక్కో ప్యాకేజీగా వర్గీకరిస్తూ మొత్తం 34 ప్యాకేజీలుగా పనులను విభజించి గతేడాది అక్టోబర్ 23న టెండర్లు పిలిచారు.
డిసెంబర్‌లో గడువు ముగిసినా టెండర్లు వేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం 2 సార్లు గడువు పెంచాల్సి వచ్చింది. పెండింగ్‌లో ఉండే 60 శాతం బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ గ్యారంటీ ఇవ్వడంతో నేషనల్వైడ్ఏజెన్సీలు ముందుకొచ్చాయి. దీంతో రాష్ట్రంలో రూ.13,006 కోట్లతో చేపట్టబోయే హ్యామ్ రోడ్ల నిర్మాణ ప్రక్రియ ఇక స్పీడ్ అందుకోనున్నది.
ఆర్‌బీఐ గ్యారంటీతో ముందుకొచ్చిన కంపెనీలు
హ్యామ్ ప్రాజెక్టులో పనులు చేపడితే ఒప్పందం ప్రకారం 30 నెలల్లో పనులు కంప్లీట్ చేసిన సమయంలో వర్క్ చేసిన సంస్థకు 40 శాతం బిల్లులను మాత్రమే చెల్లిస్తారు. ముందుగా రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ చేసినప్పుడు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం, 30 నెలల్లోగా వర్క్ కంప్లీట్ అయ్యే నాటికి 30 శాతం నిధులు ఇస్తారు. బ్యాలెన్స్ 60 శాతం నిధుల చెల్లింపునకు 15 ఏండ్ల గడువు పెట్టారు. ఈ నిబంధనే టెండర్లకు అడ్డంకిగా మారింది.
ప్రభుత్వం మారితే బిల్లులు ఎలా చెల్లిస్తారంటూ టెండర్లు వేయకుండా కాంట్రాక్టర్లు మొండికేశారు. తమ గవర్నమెంట్ ఉన్నా.. లేకపోయినా.. విడతలవారీగా 15 ఏండ్లపాటు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగానే ఏ గవర్నమెంట్ వచ్చినా హ్యామ్ రోడ్ల బిల్లులు ఆపకుండా చర్యలు తీసుకున్నది. ఈ విషయాన్ని కాంట్రాక్ట్ సంస్థలకు తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున జీవో జారీ చేసింది. కాంట్రాక్టర్లు తమకు ఆర్బీఐ గ్యారంటీ కావాలని కోరగా.. ఆర్‌బీఐ బ్యాంకర్లతో మీటింగ్ పెట్టి కాంట్రాక్ట్ సంస్థలను టెండర్లు వేసేలా చర్యలు తీసుకున్నది.
90కి పైగా దాఖలైన టెండర్లు
జాతీయస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న 27 కంపెనీలు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యామ్టెండర్లలో పాల్గొన్నాయి. టెండర్ గడువు ముగియడంతో హ్యామ్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు టెక్నికల్ బిడ్లను తెరవగా 34 ప్యాకేజీలకు సంబంధించి పనులు దక్కించుకోవడానికి 90కి పైగా టెండర్లు దాఖలైనట్టు తేలింది. ఒక్కో కంపెనీ, మూడు, నాలుగు టెండర్లకు పైగా దాఖలు చేసినట్లుగా సర్కారు ఇంజినీర్లు తెలిపారు. ఎన్‌హెచ్ఏఐ, 11 రాష్ట్రాల్లో హ్యామ్ ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొన్నట్టు ఇంజినీర్లు తెలిపారు.
టెండర్లు వేసిన జాతీయస్థాయి కంపెనీలు!
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల పనులను ఒక్క ప్యాకేజీ కింద టెండర్లు పిలిచింది. దీంతో జాతీయ స్థాయిలో అనుభవం ఉండి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కంపెనీలు ఈ వర్క్‌లు దక్కించుకోవడానికి పోటీ డ్డాయి. టెక్నికల్ బిడ్లు తెరవడంతో ఈ- ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఏయే కంపెనీలు టెండర్లు దాఖలు చేశారో ఆ విషయం హ్యామ్ ప్రాజెక్ట్ ఇంజినీర్లకు తెలిసిపోయింది. ఫైనాన్షియల్ బిడ్లను ఇంకా తెరవనందున ఏయే కంపెనీలు ఎంత శాతం ఎక్కువ, తక్కువకు టెండర్లు కోడ్ చేశారో ఆ విషయం ఇంజినీర్లకు తెలవలేదు. రాష్ట్రంలో చేపట్టిన హ్యామ్ రోడ్ల పనుల కోసం టెండర్ వేసిన కంపెనీల వివరాలను సర్కారు ప్రకటించింది.
త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు తెరుస్తం..
ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రూ.13,006 కోట్లతో చేపట్టబోయే 34 ప్యాకేజీల పనులకు సంబంధించి పిలిచిన టెండర్లలో 27 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రస్తుతానికి టెక్నికల్ బిడ్లు తెరిచి టెండర్లు వేసిన కంపెనీల అర్హతలు, వాళ్లు జతచేసిన సర్టిఫికెట్లు ఒరిజినలా..? నకిలీవా?లాంటి విషయాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నాం.
త్వరలోనే ఈ కంపెనీల వివరాలను టెండర్ కమిటీలో పెట్టి చర్చిస్తాం. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరిచి తక్కువ కోడ్ చేసిన కంపెనీలతో వర్క్ అగ్రిమెంట్లు చేసుకుంటం.
- వెంకటేశ్వర్రావు,
ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్, హ్యామ్ ప్రాజెక్ట్, ఆర్ అండ్ బీ శాఖ, హైదరాబాద్
