మలేషియా జైలు నుంచి  విడుదలైన లింగాపూర్ వాసులు

మలేషియా జైలు నుంచి  విడుదలైన లింగాపూర్ వాసులు
  • కేటీఆర్​ను కలిసిన బాధితులు

కడెం, వెలుగు: ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడ అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద అరెస్టయిన కడెం మండలం లింగాపూర్,  దస్తూరాబాద్, మున్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురిలో ముగ్గురు యువకులు విడుదలయ్యారు. తమవారిని విడిపించి తీసుకురాలని వారి కుటుంబసభ్యులు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్​ను కోరగా ఇటీవల ఆయన మలేషియా వెళ్లి అక్కడి పోలీసులతో మాట్లాడారు. తన సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో కృషి చేశారు. దీంతో లింగాపూర్ గ్రామానికి చెందిన గురిజల శంకర్, గురిజల రాజేశ్వర్, తలారి భాస్కర్ ను మలేషియా అధికారులు జైలు నుంచి విడుదల చేయడంతో బుధవారం వారు హైదరాబాద్​కు చేరుకున్నారు. జాన్సన్​ నాయక్​తో కలిసి హైదరాబాద్​లోని కేటీఆర్​ నివాసంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మలేషియాలో తాము పడ్డ ఇబ్బందులను చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. మొదటి నుంచి తమకు అన్ని విధాలుగా అండగా ఉన్న జాన్సన్ నాయక్​కు రుణపడి ఉంటామని బాధితులు, వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.