మీ ప్రేమను తీసుకెళ్తున్నాం ..ఇండియాకు తిరిగొస్తా: మెస్సీ

మీ ప్రేమను తీసుకెళ్తున్నాం ..ఇండియాకు  తిరిగొస్తా: మెస్సీ
  • ఢిల్లీ కోట్లా స్టేడియంలో సందడి చేసిన మెస్సీ
  • ‘గోట్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ఘన ముగింపు
  • ఇండియాకు తిరిగి వస్తానని ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ లెజెండ్ ప్రకటన

న్యూఢిల్లీ:  తనను దైవంగా ఆరాధించే అభిమానుల కలను నిజం చేస్తూ.. మూడు రోజుల పాటు నాలుగు నగరాలను ఉర్రూతలూగించిన అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ త్వరలోనే మళ్లీ వస్తానంటూ ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ముగించాడు. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో ఒకింత గందరగోళం నడుమ ప్రారంభమైన ఈ ‘గోట్  ఇండియా టూర్’ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం అభిమానుల నీరాజనాల మధ్య విజయవంతంగా పూర్తయింది. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌తో అద్భుతాలు చేసే తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారైనా చూడాలన్న వేలాదిమంది కోరిక సోమవారం ఫిరోజ్‌‌‌‌ షా కోట్లా మైదానంలో నెరవేరింది. శనివారం కోల్‌‌‌‌‌‌‌‌కతా టూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అసౌకర్యాలకు భిన్నంగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం ఎంతో పకడ్బందీగా సాగింది. దాదాపు 25 వేల మంది ఫ్యాన్స్  అర్జెంటీనా జెర్సీలు ధరించి రావడంతో స్టేడియం మొత్తం నీలిరంగు సముద్రాన్ని తలపించింది. మెస్సీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియం దద్దరిల్లేలా అతని నామస్మరణ మారుమోగిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న మెస్సీ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో భద్రతా కారణాల వల్ల అభిమానుల దగ్గరకు వెళ్లలేకపోయిన మెస్సీ  ప్రముఖుల సందడి చాలా తక్కువగా కనిపించిన ఢిల్లీలో మాత్రం స్వేచ్ఛగా మైదానంలో కలియతిరిగాడు. తన ఇంటర్ మయామి టీమ్‌‌‌‌‌‌‌‌మేట్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి స్టాండ్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అభిమానుల వైపు బాల్స్‌‌‌‌‌‌‌‌ను కిక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సందడి చేశాడు. ఈ క్రమంలో మెస్సీ బలంగా కిక్ చేసిన ఓ బాల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం పైకప్పుపై పడటం విశేషం.

మెస్సీకి టీ20 వరల్డ్ కప్ టికెట్‌‌‌‌

దాదాపు 40 నిమిషాలు స్టేడియంలో సందడి చేసిన మెస్సీ అందరినీ ఉత్సాహపరిచాడు.స్టేడియంలోకి వచ్చిన వెంటనే 7x7 సెలబ్రిటీ మ్యాచ్ ముగింపును  తిలకించాడు. ఆ  ఎగ్జిబిషన్ మ్యాచ్ విజేతలకు ట్రోఫీ అందించాడు.  మినర్వా అకాడమీ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ టీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేకంగా సత్కరించాడు.  ఒక్కొక్క జట్టులో 15 మంది చిన్నారులు ఉన్న రెండు గ్రూపులకు మెస్సీ అండ్ కో చిన్న  క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమం చివర్లో పలువురు ప్రముఖులు మెస్సీని కలిసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఐసీసీ చైర్మన్ జై షా, డీడీసీఎ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ, ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ మాజీ  కెప్టెన్ బైచుంగ్ భూటియా మెస్సీతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జై షా.. మెస్సీ, సువారెజ్‌‌‌‌‌‌‌‌, డిపాల్ పేర్లు, నంబర్లు ముద్రించిన టీమిండియా జెర్సీలను వారికి బహూకరించాడు. అంతేకాకుండా, వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–యూఎస్ఏ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రావాలని ఆహ్వానిస్తూ ప్రత్యేక టికెట్‌‌‌‌‌‌‌‌ను కూడా అందించాడు. చివరగా స్పానిష్ భాషలో ప్రసంగించిన మెస్సీ ‘గ్రాసియస్ ఢిల్లీ.. హాస్టా ప్రొంటో (థ్యాంక్యూ ఢిల్లీ !  త్వరలో మళ్ళీ కలుద్దాం)’ అని అనగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  

షేక్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌కు రూ. కోటి! 

మెస్సీ చార్టర్ విమానం ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ  రావాల్సి ఉండగా పొగమంచు కారణంగా ఆలస్యమై మధ్యాహ్నం 2:30 గంటలకు ల్యాండ్ అయింది. ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి తొలుత లీలా ప్యాలెస్ హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న మెస్సీ అక్కడ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’లో పాల్గొన్నారు. ఇందులో పలువురు టాప్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు మెస్సీకి షేక్‌‌‌‌‌‌‌‌హ్యాండ్ ఇచ్చేందుకు ఒక్కొక్కరూ రూ. కోటి చెల్లించినట్టు సమాచారం. కాగా, షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెస్సీ కలవాల్సి ఉంది. అయితే పీఎం మూడు దేశాల పర్యటన నిమిత్తం జోర్డాన్​ వెళ్లడంతో ఈ భేటీ రద్దయింది. ఏదేమైనా సాకర్ మాంత్రికుడి రాక దేశ క్రీడా చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

మీరు చేసినదంతా అద్భుతం

ఈ మూడు రోజుల్లో  మాపై మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు అందరికీ ధన్యవాదాలు. ఇది మాకు నిజంగా గొప్ప అనుభవం. ఈ టూర్ తక్కువ సమయమే అయినా చాలా గొప్పగా సాగింది. మాపై మీకు ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. కానీ దానిని నేరుగా అందుకోవడం ఎంతో అందమైన అనుభూతి. ఈ రోజుల్లో మీరు మా కోసం చేసినదంతా అద్భుతం. కాబట్టి, ఈ ప్రేమ మొత్తాన్ని మాతోతీసుకెళ్తున్నాం. మేము  తప్పకుండా  తిరిగి వస్తాం. బహుశా ఒక రోజు మ్యాచ్ ఆడటానికైనా లేదా వేరే సందర్భంలోనైనా మరోసారి ఇండియాకు కచ్చితంగా తిరిగి వస్తాం.
- లియోనల్ మెస్సీ