
- డిసెంబర్ 13న భాగ్యనగరంలో
- సందడి చేయనున్న సాకర్ లెజెండ్
- ‘గోట్ టూర్ టు ఇండియా’లో
- కొచ్చి స్థానంలో మన సిటీకి చోటు
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని, అతని ఆటను నేరుగా చూసే భాగ్యం హైదరాబాద్ అభిమానులకు దక్కనుంది. డిసెంబర్‌లో పేరిట మెస్సీ ఇండియాలో పర్యటించనున్నాడు. ‘గోట్ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా కేరళలోని కొచ్చిలో జరగాల్సిన అర్జెంటీనా ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దవడంతో ఆ ప్లేస్‌లో హైదరాబాద్‌ను చేర్చినట్లు టూర్ ఆర్గనైజర్ శతద్రు దత్తా శనివారం ప్రకటించాడు. ఈ పాన్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలకు వచ్చి సందడి చేయనున్నాడు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ డిసెంబర్ 13న రాత్రి 7–8.45 గంటల మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియం లేదా గచ్చిబౌలి ఫుట్‌బాల్ స్టేడియంలో ‘గోట్ కప్’ ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడనున్నాడు. అదే రోజు సాయంత్రం ఫ్యాన్స్, సెలెబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఉంటుందని ఆర్గనైజర్స్ తెలిపారు. హైదరాబాద్ లెగ్ కేవలం ఒక స్పోర్టింగ్ ఈవెంట్ మాత్రమే కాకుండా, సౌతిండియా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే ఒక భారీ వేడుక అవుతుందని దత్తా హామీ ఇచ్చాడు. ఇందులో సెలెబ్రిటీ మ్యాచ్, ఫుట్‌బాల్ క్లినిక్, సన్మానాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. సౌతిండియా ఫిల్మ్ స్టార్స్ ఈ ఈవెంట్‌కు అటెండ్ అవుతారు. డిసెంబర్ 12 రాత్రి కోల్‌కతాకు చేరుకోనున్న మెస్సీ టూర్ షెడ్యూల్‌ను స్వల్పంగా మార్చినట్టు దత్తా తెలిపాడు. ఈ టూర్‌లో మెస్సీతో పాటు అతని టీమ్‌మేట్స్ లూయిస్ సురేజ్, రోడ్రిగో డిపాల్ కూడా పాల్గొంటారు.