బైక్‌పై వెళ్తున్న రైతుకు ఎదురుపడ్డ సింహాలు: రియాక్షన్ చూడండి

బైక్‌పై వెళ్తున్న రైతుకు ఎదురుపడ్డ సింహాలు: రియాక్షన్ చూడండి

మనిషికి సింహాలు ఎదురుపడితే వాటి రియాక్షన్ ఏంటి? గర్జిస్తూ మీద పడిపోవడమే అని అనుకుంటాం అందరం. అలాగే బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా సింహాన్ని ఎదురుగా చూస్తే ఆ మనిషి ఏం చేస్తాడు? ప్రాణ భయంతో వేగంగా బైక్ రివర్స్ చేయడమో లేదా బైక్ వదిలేసి పరిగెత్తడమో చేస్తాడనుకుంటాం. అంతేకదా!! కానీ, అక్కడ ఈ రెండూ జరగలేదు. బైక్ మీద పొలానికి వెళ్తున్న రైతుకు ఓ ఆడ సింహం, రెండు పిల్లలు నడుచుకుంటూ ఎదురుపడ్డాయి. వాటిని చూసి ఒక్క క్షణం బైక్ ఆపి అలానే నిల్చున్నాడతను. ఆ సింహాలు నెమ్మదిగా దారిచ్చి.. రోడ్డు పైనుంచి పక్కకు వెళ్లిపోయాయి. ఈ రియాక్షన్ ఎవరికైనా కొంచెం షాకింగ్‌గానే ఉంటుంది. అయితే ఇది నిజంగా జరిగింది.

గుజరాత్‌లోని గిర్ సాంక్చురీకి ఆనుకుని ఉన్న ఓ గ్రామానికి చెందిన రైతు బైక్‌పై తన పొలానికి వెళ్తుండగా ఇలా సింహాలు ఎదురుపడినప్పుడు జరిగిన ఘటనను దూరం నుంచి ఎవరో వీడియో తీశారు. నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియోలో సింహాలు రోడ్డుపై వెళ్తూ మనుషుల స్పేస్‌ని గౌరవించడం అమేజింగ్ అన్న క్యాప్షన్‌తో 36 సెకన్ల వీడియోను ట్వీట్ పెట్టారు.

గిర్ అభయారణ్యానికి ఆనుకుని ఉన్న మట్టి రోడ్డులో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఎదురుపడగానే సింహాలు వాటి దారి మార్చుకుని, అడవిలోకి పోవడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘మనది నాగరిక దేశం. సో, మన సింహాలకూ నాగరికత తెలుసు’ అంటూ ఈ వీడియోను ఐఏఎఫ్ అధికారి సుశాంత నందా రీ ట్వీట్ చేశారు. రియల్లీ సివిలియన్స్ అంటూ నెటిజన్లు సింహాలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వాటిలాగే మనుషులు కూడా జంతువుల స్పేస్‌ను గౌరవించాలని ఓ నెటిజన్ అన్నాడు.