కేన్సర్​ నిర్ధారణకు లిక్విడ్​ టెస్టు

కేన్సర్​ నిర్ధారణకు లిక్విడ్​ టెస్టు
  • హైదరాబాద్​ స్టార్టప్​ ‘ఆంకోఫీనోమిక్స్​’ కొత్త ఆలోచన
  • అందరికీ అందుబాటులో ఉండేలా ‘లిక్విడ్ బయాప్సీ’
  • మూత్ర పరీక్షతోనూ గుర్తింపు

కేన్సర్​.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంటున్న మహమ్మారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) లెక్కల ప్రకారం, ఎక్కువ మరణాలకు కారణమవుతున్న రోగం ఇదే. 2030 నాటికి కేన్సర్​ మరణాలు 1.31 కోట్లకు పెరుగుతాయని అంచనా. ఒక్క ఇండియాలోనే పోయినేడాది 7,84,821 మంది కేన్సర్​కు బలయ్యారు. సిగరెట్లు, మద్యం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల కేన్సర్​ వస్తుంటుంది. ప్రారంభ దశలోనే దానిని గుర్తించే పరీక్షలు బాగా నొప్పితో కూడుకున్నవి. భరించలేని బాధనిచ్చేవి. ఆ బాధ నుంచి తప్పించేందుకు హైదరాబాద్​కు చెందిన స్టార్టప్​ కంపెనీ ఆంకోఫీనోమిక్స్​ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేన్సర్​ పరీక్ష నొప్పిలేకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా ఓ కొత్త పరీక్షను తీసుకొచ్చింది. అదే ‘లిక్విడ్​ బయాప్సీ’ టెస్ట్​. రక్తం, మూత్రం నమూనాలతోనే ప్రారంభ దశలో ఉన్న కేన్సర్​ను ఈ పరీక్ష ద్వారా గుర్తించొచ్చు.

ఇదీ ఆ టెస్టు

మామూలుగా అయితే కేన్సర్​ను గుర్తించేందుకు నీడిల్​ బయాప్సీ, ఓపెన్​ సర్జికల్​ బయాప్సీని చేస్తారని కంపెనీ ఓనర్​ శిబి చక్రవర్తి చెప్పారు. ‘‘ఈ ప్రాసెస్​ చాలా బాధతో కూడుకున్నది. ఒంట్లోని ఓ కణజాలాన్ని (టిష్యూ)ను కట్​ చేస్తారు. దాన్ని పాథాలజీ ల్యాబ్​కు పంపి అది కేన్సరా కాదా అని తేలుస్తారు. ఇది చాలా రిస్క్​ కూడా. అందులోనూ ఔట్​పేషెంట్​ రోగులకు చెయ్యరు” అని ఆయన చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగానే ‘లిక్విడ్​ బయాప్సీ’ని తాము తీసుకొచ్చామన్నారు. అమెరికా, బ్రిటన్​ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ తరహా టెస్టులను చేస్తున్నాయని, ఇండియాలో మాత్రం ఇదే మొదటిదని తెలిపారు.

రోగిని బట్టి ట్రీట్​మెంట్​

ఇప్పటిదాకా కేన్సర్​ రోగులందరికీ ఒకేరకమైన ట్రీట్​మెంట్​ చేస్తున్నారని శిబి చక్రవర్తి అంటున్నారు. కేన్సర్​ను బట్టి కాకుండా అందరికీ ఒకేలా కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు చేస్తున్నారన్నారు. కేన్సర్​ పేషెంట్​కు సరైన మందు ఇచ్చేలా చేయడమే తమ మిషన్​ అన్నారు. కేన్సర్​ కారక కణాలపై రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపైనే ట్రీట్​మెంట్​ కొనసాగుతుందన్నారు. ప్రపంచస్థాయి లేబొరేటరీ తమకు ఉందన్నారు. క్లినికల్​ ట్రయల్స్​ చేయడానికి ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నామని, అన్నీ అయ్యాక కమర్షియల్​గా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఫార్మాకంపెనీలు కేన్సర్​కు ఎప్పుడూ ఏదో ఒక కొత్త మందును తీసుకొస్తున్నా, కొత్త డయాగ్నస్టిక్​ టెస్టులు మాత్రం రావడం లేదన్నారు. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్​ విన్నర్​ డాక్టర్​ జేమ్స్​ యాలిసన్​తో కలిసి పనిచేస్తున్న రీసెర్చ్​ సైంటిస్టులు, ఇమ్యునో ఆంకాలజిస్టుల్లో ఒకరు శిబి చక్రవర్తి.

ఇది స్టార్టింగే

ప్రస్తుతం కంపెనీ గర్భాశయ ముఖద్వార కేన్సర్​ (సెర్వికల్​ కేన్సర్​)కు మాత్రమే టెస్టును చేస్తోంది. ప్రస్తుతం మహిళలకు పాప్​స్మియర్​ లేదా మమ్మోగ్రామ్​ ద్వారా మాత్రమే టెస్టులు చేస్తున్నారని, కేన్సర్​ అని అనుమానం వస్తేనే టెస్టు కోసం తమ దగ్గరకు వస్తున్నారని శిబి చెప్పారు. రొమ్ము కేన్సర్​ను గుర్తించడం సులువే అయినా, అండాశయ కేన్సర్​ను గుర్తించడమే చాలా కష్టమని చెప్పారు. కేన్సర్​ గడ్డ పెరిగాక మాత్రమే అది బయటపడుతుందన్నారు. ఈ లిక్విడ్​ బయాప్సీ ద్వారా అండాశయ కేన్సర్​నూ తేలిగ్గా గుర్తించొచ్చన్నారు. ఊపిరితిత్తుల కేన్సర్​, ప్రోస్టేట్​ కేన్సర్​లను కేవలం మూత్రపరీక్ష ద్వారా గుర్తించొచ్చన్నారు.

తక్కువ ధరకే

ప్రస్తుతం కేన్సర్​ పరీక్షలకు కంపెనీలు ₹1.5 లక్షల నుంచి ₹5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని, మామూలు జనానికీ దానిని అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని శిబి తెలిపారు. తమ లిక్విడ్​ బయాప్సీ టెస్టుకు ₹25 వేలు ఖర్చువుతోందని, దానిని ₹7500కు తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా ప్రభుత్వ పథకాలైన సీజీహెచ్​ఎస్​, ఆయుష్మాన్​ భారత్​ కిందకి ఈ టెస్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల చాలా మందికి టెస్టును ఫ్రీగా చేయించుకునే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల కోసం లెట్స్​ వెంచర్​తో కలిసి పనిచేస్తోంది.