బ్రిడ్జి కింద కాపుకాసి ప‌ట్టుకున్నారు: అక్ర‌మంగా మ‌ద్యం, నాటు సారా తర‌లింపు‌

బ్రిడ్జి కింద కాపుకాసి ప‌ట్టుకున్నారు: అక్ర‌మంగా మ‌ద్యం, నాటు సారా తర‌లింపు‌

శ్రీకాకుళం : సీక్రెట్ గా మ‌ద్యం, నాటు సారా త‌ర‌లిస్తున్న వారిని ప‌క్కా స‌మాచారంతో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ సంఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో జ‌రిగింది. లాక్ డౌన్ లో మద్యం దుకాణాలను బంద్ చేయ‌డంతో మందు బాబుల అవసరాలు తీర్చేందుకు కొన్ని రోజులుగా అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఒరిస్సా నుండి మద్యం, నాటు సారా అక్రమ రవాణా చేస్తున్నారు. స‌మాచారం అందుకున్న ఏపీ ఎక్సైజ్ శాఖ దీనిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

ప‌క్కా ప్లానింగ్ తో శ‌నివారం ఉద‌యం వజ్రపు కొత్తూరు మండలం ఒంకులూరు బ్రిడ్జి వద్ద కాపుకాసి మద్యం, నాటు సారా తరలిస్తున్న వారిని సరుకుతో సహా అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వీరు మందస మండలం టి.గంగువాడ నుండి వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి మద్యం తరలిస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో 52 క్వాటర్ బోటిల్స్, 20 లీటర్ల నాటు సారా పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలపై జోగి ప్రశాంత్, జోళ్ళ గౌరీశంకర్, కోడ లక్ష్మణరావు, కళ్యాణం రాజేష్ లు చెరో వాహనంపై ఇద్దరిద్దరుగా సరుకు తీసుకుని ప్రయాణం చేస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నామ‌న్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.