మున్సిపోల్స్‌‌తో లిక్కర్‌‌ కిక్‌‌!

మున్సిపోల్స్‌‌తో లిక్కర్‌‌ కిక్‌‌!

అమ్మకాలు పెంచే పనిలో ఆబ్కారీ శాఖ
ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లలోనూ ఫుల్లుగా రాబడి
రేట్లు పెరగడంతో ఈసారి మరింత ఎక్కువ ఇన్​కం
ఎన్నికల కోసం ముందే లిక్కర్​ కొనిపెట్టుకుంటున్న లీడర్లు
టికెట్ హామీ ఉన్నవారు, ఆశావహులూ అదే దారిలో..
అనుచరుల ఇళ్లు, గోడౌన్లలో డంపులు

హైదరాబాద్‌‌, వెలుగుమున్సిపల్‌‌ ఎలక్షన్లతో వీలైనంత మేర అదనపు ఆదాయం రాబట్టుకోవడంపై ఆబ్కారీ శాఖ కన్నేసింది. ఎలక్షన్లతో పెరిగే డిమాండ్​తోపాటు ఇటీవల రేట్లు కూడా పెంచిన నేపథ్యంలో రూ.500 కోట్ల మేర అదనంగా సమకూరుతుందని అంచనా వేస్తోంది. వైన్​షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున స్టాక్​ కొనుగోలు చేస్తుండటంతో అవసరమైన మేర సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. 2018 డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి వరుసగా జరిగిన ఎన్నికలతో ఇప్పటికే భారీగా ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధుల కటకట ఎదుర్కొంటున్న సర్కారు.. ఆబ్కారీ ఆదాయం పెరుగుతోందన్న ఆశతో ఉంది. మరోవైపు ఎలక్షన్ల కోసం ప్రధాన పార్టీల లీడర్లు భారీగా లిక్కర్​ కొని స్టాక్​ చేసుకుంటున్నారు.

ఆబ్కారీ శాఖపైనే దృష్టి

సాధారణంగా రాష్ట్రంలో నెలకు రూ.1,600 నుంచి రూ.1,800 కోట్ల దాకా లిక్కర్​ అమ్మకాలు జరుగుతుంటాయి. పండుగలు, పెళ్లిళ్లు ఉండే నెలల్లో మాత్రం మరో రూ.200 కోట్ల మేరకు పెరుగుతుంటుంది. అయితే ఎలక్షన్ల టైం కావడంతో ఈ నెలలో అదనపు రాబడి పొందడంపై సర్కారు దృష్టి పెట్టింది. వాస్తవానికి కొద్దినెలలుగా వివిధ విభాగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో సర్కారు నిధుల కటకట ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మున్సిపోల్స్​ జరుగుతుండటంతో ఆబ్కారీ శాఖపై నజర్​ పెట్టింది. ఈ నెలలో రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు అదనంగా వస్తుందని అంచనా వేస్తోంది. ఇటీవల లిక్కర్​ ధరలు పెంచడం కూడా కలిసిరానుంది. అయితే అసెంబ్లీ, లోక్​సభ ఎలక్షన్లయితే రాష్ట్రమంతటా జరుగుతాయి. మున్సిపల్‌‌ ఎన్నికలు కావడంతో కొన్ని ప్రాంతాల్లోనే లిక్కర్​ సేల్స్​ పెరుగుతాయి.

వరుస ఎలక్షన్లతో మస్తు పైసలు

2018 చివరి నుంచీ వరుసగా వచ్చిన ఎలక్షన్లతో ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండింది. 2018 డిసెంబర్‌‌లో అసెంబ్లీ ఎలక్షన్లు, 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఈ రెండు ఎన్నికలతో ఏకంగా రూ.800 కోట్ల మేర అదనపు రాబడి వచ్చింది. 2019 ఏప్రిల్‌‌లో లోక్​సభ ఎన్నికలు జరిగాయి. అదే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌‌ వచ్చింది. వీటికి మేలో మూడు విడతలుగా పోలింగ్​ జరిగింది. దీంతో ఏప్రిల్‌‌ ఒకటో తేదీ నుంచి మే 13వ తేదీ వరకు రూ. 490 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. తాజాగా మున్సిపల్​ఎలక్షన్లు వచ్చాయి. ఈ మధ్యే లిక్కర్​ రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో రాబడి బాగానే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

లీడర్ల ‘మందు’జాగ్రత్త

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎలక్షన్లు జరుగనున్నాయి. అన్ని పార్టీల లీడర్లూ సిద్ధమవుతున్నారు. టికెట్ల కోసం పైరవీలు, ఖర్చులకు అవసరమైన సొమ్ము రెడీ చేసుకోవడం మొదలుపెట్టారు. టైం దగ్గరపడుతుండటంతో లీడర్లంతా ‘మందు’జాగ్రత్తలో పడ్డారు. ఎలక్షన్ల సమయంలో లిక్కర్​ కొనడం, తరలించడం ఇబ్బంది అవుతుందని ముందే భారీగా కొనిపెట్టుకుంటున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల నుంచి చైర్మన్, మేయర్​ ఆశావహుల దాకా చాలా మంది ఇదే పనిలో పడ్డారు. మున్సిపల్​ రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాకున్నా.. టికెట్​పై ఇప్పటికే హామీ ఉన్నవారు, తమకు చాన్స్​ వస్తుందని భావిస్తున్నవారు కూడా లిక్కర్​ కొని, దాచిపెడుతున్నారు. ఎలక్షన్లలో ప్రచారం చేసేందుకు వచ్చేవారికి రోజూ డబ్బులతోపాటు లిక్కర్​ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటంతోపాటు ప్రలోభపెట్టేందుకూ మందును రెడీ చేసుకుంటున్నారు. అనుచరుల ఇండ్లు, గోడౌన్లు, దుకాణాల్లో స్టాక్​ చేస్తున్నారు.

బెల్టు షాపుల వాళ్లు కూడా..

ఎలక్షన్ల నేపథ్యంలో బెల్టు షాపుల వాళ్లు కూడా ఫుల్లుగా లిక్కర్​ కొనిపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినప్పుడు చాలా శివారు గ్రామాలను పట్టణాల్లో కలిపారు. టౌన్​కు కొంత దూరంలో ఉండటంతో అలాంటి చోట్ల బెల్టుషాపులు జోరుగా నడుస్తున్నాయి. పట్టణాల్లోనూ అర్ధరాత్రిదాకా లిక్కర్​ అమ్మే బెల్టుషాపులు ఉన్నాయి. వాటి నిర్వాహకులంతా వీలైనంత లిక్కర్​ను స్టాక్​ పెట్టుకుంటున్నారు. కొందరు లీడర్లు, బెల్టుషాపుల వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి జీరో లిక్కర్ కూడా తెప్పించుకుంటున్నట్టు సమాచారం.