రాష్ట్రంలో భారీగా తగ్గిన లిక్కర్ సేల్స్

రాష్ట్రంలో భారీగా తగ్గిన లిక్కర్ సేల్స్

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో లిక్కర్‌‌ సేల్స్‌‌ భారీగా తగ్గాయి. 15 రోజుల నుంచి అమ్మకాలు పడిపోయాయి. ఇందులో బీర్ల విక్రయాలు సగానికి పైగా తగ్గాయి. జనం చేతిలో డబ్బులు లేకపోవడం, మైగ్రెంట్‌‌ లేబర్‌‌ తరలిపోవడం తదితర అంశాలే సేల్స్‌‌ తగ్గడానికి కారణాలని ఎక్సైజ్‌‌ శాఖ అంచనా వేస్తోంది. గిరాకీ లేకపోవడంతో సర్కార్‌‌కు లైసెన్స్‌‌ ట్యాక్స్ కూడా కట్టలేకపోతున్నామని వైన్స్‌‌ ఓనర్లు లబోదిబోమంటున్నారు.

తొలి వారంలో రూ.902 కోట్లు

మన దగ్గర 2,211 వైన్స్‌‌ ఉన్నాయి. వీటికి రాష్ట్రంలో ఉన్న 19 డిపోల నుంచి లిక్కర్ సరఫరా అవుతుంది. లాక్‌‌డౌన్‌‌తో మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్‌‌ బంద్‌‌ చేశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.4,000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి తిరిగి వైన్స్‌‌ ప్రారంభమయ్యాయి. నెలన్నర తర్వాత లిక్కర్‌‌ షాపులు తెరవడంతో జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో 6 నుంచి 12వ తేదీకి ఒక్క వారంలోనే రూ. 902 కోట్ల అమ్మకాలు జరిగాయి. కానీ ఆ తర్వాత నుంచి సేల్స్‌‌ తగ్గుతూ వచ్చాయి. 13 నుంచి 27వ తేదీ వరకు 1,040 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఇప్పటిదాకా ఈ నెలలో రూ.1,942 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. లాక్‌‌డౌన్​కు ముందు సాధారణంగా రోజుకు సగటున 70 కోట్ల కంటే ఎక్కువే అమ్మకాలు జరిగేవి. ఈ మధ్య ప్రభుత్వం ధరలు 20 శాతం వరకు పెంచింది. దీంతో రూ.85 కోట్లపైనే ఆదాయం రావాలి. కానీ ఒక్కో రోజు 50 కోట్లు కూడా రావడంలేదని అధికారులు చెబుతున్నారు. లాక్​డౌన్ సడలింపుల తర్వాత జిల్లాల్లోని షాపుల్లో తొలుత రోజుకు రూ.7 లక్షల దాకా అమ్మకాలు జరిగాయని, ఇప్పుడు 2 లక్షలు కూడా దాటడం లేదని వైన్స్‌‌ యజమానులు పేర్కొంటున్నారు.

ఎందుకు తగ్గినయ్?

లాక్‌‌డౌన్‌‌తో అన్ని  రంగాల నుంచి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల జీతంలో సర్కార్‌‌ కోత పెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని అన్ని ప్రైవేట్‌‌ సంస్థలు కూడా కోతలు పెట్టాయి. రెండు నెలలుగా సగం జీతాలే వస్తున్నాయి. దీంతో జనం చేతిలో డబ్బులు కనిపించడంలేదు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దాకా లిక్కర్‌‌ రేట్లు పెంచడంతో పెద్ద మొత్తంలో కొనడానికి వెనకాడుతున్నారు. మరోవైపు లాక్‌‌డౌన్‌‌ ప్రారంభం నుంచే మైగ్రెంట్ లేబర్లు సొంత రాష్ట్రాల బాటపట్టారు. ఇక్కడ ఉన్న లేబర్‌‌కు పని దొరకట్లలేదు. సాధారణంగా వైన్స్‌‌కు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటలను ప్రైమ్‌‌ టైంగా చెబుతారు. రోజు మొత్తంలో సగం సేల్స్‌‌ ప్రైమ్‌‌ టైంలోనే జరుగుతాయని వైన్స్‌‌ యజమానులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం వైన్స్‌‌కు 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. దీంతో లిక్కర్‌‌ సేల్స్‌‌ జరగడం లేదు.

65 శాతం బీర్‌‌ సేల్స్‌‌ డౌన్‌‌

సాధారణంగా ఐఎంఎల్‌‌ (ఇండియన్ మేడ్ లిక్కర్)తో పోలిస్తే బీర్లనే ఎక్కువగా తాగుతారు. ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు మరింత ఊపందుకుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నెలలో 65 శాతం బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 50,74,152 కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ సారి మాత్రం 18,06,081 కేసులు మాత్రమే సేల్‌‌ అయ్యాయి. ఐఎంఎల్‌‌ కూడా పెద్దగా పెరగలేదు. రంగారెడ్డి డిపో–1 పరిధిలో అత్యధికంగా 81 శాతం బీర్ల అమ్మకాలు తగ్గాయి. మేడ్చల్‌‌ డిపో–2 పరిధిలో 80 శాతం మేర పడిపోయాయి. మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ 50 శాతానికి పైగా బీర్ల సేల్స్‌‌ తగ్గిపోవడం గమనార్హం. కరోనా నేపథ్యంలో కూల్‌‌ బీర్లను తాగడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ట్యాక్స్ ఎట్ల కట్టేది?

లిక్కర్‌‌ సేల్స్‌‌ తగ్గడంతో వైన్స్‌‌ యజమానులు లబోదిబోమంటున్నారు. లాక్‌‌డౌన్‌‌తో 45 రోజులు వైన్స్‌‌ బంద్‌‌ అయ్యాయని, 45 రోజులపాటు లైసెన్స్‌‌ పీరియడ్‌‌ కోల్పోయామని వాపోతున్నారు. అర్బన్‌‌ ప్రాంతాల్లో ఒక్కో వైన్స్ యజమాని సర్కార్‌‌కు 1.10 కోట్ల లైఫ్‌‌ ట్యాక్స్‌‌ కడతారు. అంటే ప్రతి రోజుకు 31 వేల వరకు పన్ను చెల్లించాలి. దుకాణాలు నడవకున్నా ఈ ట్యాక్స్‌‌ చెల్లించాల్సి వస్తోంది. మద్యం పాత స్టాక్‌‌పైనా సర్కార్‌‌ స్పెషల్‌‌ సెస్‌‌ విధించింది. మార్చి 22వ తేదీ వరకు వైన్స్‌‌లో ఉన్న సరుకుపై సెస్‌‌ కట్టాలని ఆదేశించింది. 31వ తేదీ లోపు కట్టకుంటే ఫైన్‌‌ విధిస్తామని పేర్కొంది. లిక్కర్‌‌ సేల్స్‌‌ పడిపోయాయని, సెస్‌‌, లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఎలా కట్టాలని వైన్స్‌‌ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.