లిక్కర్​ సేల్స్​ డౌన్​.. రేట్లు పెంచినా ఆదాయం పెరగలే

లిక్కర్​ సేల్స్​ డౌన్​.. రేట్లు పెంచినా ఆదాయం పెరగలే
  • 40 శాతం వరకు రేట్లు పెంచినా పె రగని రాబడి
  • జనం చేతిలో డబ్బులు లేకపోవడమే కారణమంటున్న అధికారులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. పోయినేడాది నవంబర్​తో పోలిస్తే ఈ నవంబర్​లో 22 శాతం మేర ఆదాయం తగ్గింది. నిరుడు ఈ టైంకు 17 లక్షల కేసుల మందు, 20 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 1,020 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 10 లక్షల కేసుల లిక్కర్​, 8 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆదాయం రూ.797 కోట్లే వచ్చింది. ఏడాది కాలంలో రేట్లను 40 శాతం పెంచినా.. మందు అమ్మకాల రాబడి 20 శాతం తగ్గడం గమనార్హం. మామూలుగా రోజూ రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్​ షాపులకు వస్తుంటుంది. ఈ నెలలో మాత్రం ఒకట్రెండు రోజులు తప్ప ఆ మార్క్​ దాటలేదు. నవంబర్​ 3న రూ. 84 కోట్లు, 4న రూ. 64 కోట్లు, 5న రూ. 67 కోట్లు, 6న రూ. 78కోట్లు, 10న రూ. 55 కోట్ల మద్యం మాత్రమే షాపులకు వెళ్లింది.

కారణమేంటి?

నిరుడు నవంబర్​లోనే కొత్త ఎక్సైజ్​ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో వైన్స్​కు మద్యం ఎక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులేవీ లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. అయితే, నిరుడు సేల్స్​ను పక్కనపెట్టినా.. పెంచిన ధరల ప్రకారమైనా ఆదాయం ఎక్కువ రావాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల జనం చేతిలో డబ్బులు లేకపోవడం కూడా సేల్స్​ తగ్గడానికి కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగతో సేల్స్​ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అక్టోబర్లో ఫుల్ సేల్స్

ఈ నెలలో అమ్మకాలు తగ్గినా అక్టోబర్​లో మాత్రం ఎక్కువగానే అయ్యాయి. పోయిన నెలలో రూ.2,623 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో 31లక్షల కేసుల లిక్కర్​, 27 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అమ్మకాలు 58 శాతం పెరిగాయి. గత ఏడాది అక్టోబర్​లో అమ్ముడైన లిక్కర్​ విలువ కేవలం రూ.1,662 కోట్లే. ఇందులో 27 లక్షల కేసుల లిక్కర్​, 38 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి.