ఈడీ రిమాండ్​ రిపోర్టు : కేజ్రీవాల్​ క్యాంప్​ ఆఫీసు నుంచే విజయ్​ నాయర్ ​కార్యకలాపాలు

ఈడీ రిమాండ్​ రిపోర్టు : కేజ్రీవాల్​ క్యాంప్​ ఆఫీసు నుంచే విజయ్​ నాయర్ ​కార్యకలాపాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన ఇవాళ ఈడీ విడుదల చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు ప్రకంపనలు సృష్టించింది. ఇందులో  ఏ5 నిందితుడు విజ‌య్ నాయ‌ర్‌ కు సంబంధించిన పలు కీలక అంశాలను ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ స్కాంలో మొట్టమొదటి అరెస్ట్​ విజయ్​ నాయర్ దే.  అతడు ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) కమ్యూనికేషన్​ స్ట్రాటజిస్ట్​ గా పనిచేసేవాడు . అతడికి ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ తో ఉన్న సంబంధం ఏమిటి ? ఢిల్లీ ప్రభుత్వం అతడిని ఎలా చూసుకుంది ? అనే అంశాలతో ముడిపడిన సమాచారాన్ని 32 పేజీల రిమాండ్​ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. దీని ప్రకారం.. “విజయ్​ నాయర్​ ఒక సాధారణ ఆప్​ కార్యకర్త కాదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కు అత్యంత సన్నిహితుడు. ఎంతగా సన్నిహితుడంటే అరవింద్​ కేజ్రీవాల్​ క్యాంప్​ ఆఫీస్​ నుంచే పనిచేసేంతగా!!

కేబినెట్​ మంత్రికి చెందిన ప్రభుత్వ బంగ్లాలో..

2020 సంవత్సరం నుంచే అరవింద్​ కేజ్రీవాల్​ క్యాంప్​ ఆఫీస్​ నుంచి విజయ్​ నాయర్​ తన కార్యకలాపాలు చక్కబెట్టుకునేవాడు. ఇదే సమయంలో ఢిల్లీ కేబినెట్​ మంత్రి కైలాశ్​ గెహ్లాట్​ కు అధికారికంగా  కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలో విజయ్​ నాయర్​ నివసించేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ కేబినెట్​ మంత్రి కైలాశ్​ గెహ్లాట్​ ఢిల్లీలోని నజఫ్​ఘర్​ ఏరియాలో ఓ ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని ఉండేవారు”అని ఈడీ రిమాండ్​ రిపోర్టులో ఉంది. కాగా, విజయ్​ నాయర్​ ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) కమ్యూనికేషన్​ స్ట్రాటజిస్ట్​ బాధ్యతలను చేపట్టకముందు ముంబై కేంద్రంగా పనిచేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్' సీఈఓగా పనిచేసేవారు. ఇతను ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సన్నిహితుడని అంటున్నారు.  

రూ.100 కోట్ల ముడుపులు..

ఢిల్లీలోని లిక్కర్​ షాపులకు మద్యం సరఫరా చేసే హోల్​ సేల్​ సంస్థలకు 12 శాతం లాభం మిగిలేలా అరవింద్​ కేజ్రీవాల్ ​సర్కారు గత ఏడాది లిక్కర్​ పాలసీని రూపొందించింది. అయితే ఇందులో దాదాపు 6 శాతానికి సమానమయ్యే మొత్తాన్ని ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్య లీడర్లకు హోల్​ సేల్​ లిక్కర్​ సరఫరా సంస్థలు ముడుపులుగా చెల్లించాలనే రహస్య డీల్​ కుదిరిందని రిమాండ్​ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ డీల్​లో భాగంగా ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులకు ఇచ్చేందుకుగానూ ఎమ్మెల్సీ కవిత, శరత్​ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్​ అరోరాలతో కూడిన సౌత్​ గ్రూపు నుంచి విజయ్​ నాయర్ కు​దాదాపు రూ.100 కోట్ల ముడుపులు అందాయని  ఈడీ పేర్కొంది.  ఇదే విషయంపై అమిత్​ అరోరా కూడా స్టేట్మెంట్​ ఇచ్చాడని రిమాండ్​ రిపోర్టులో ఈడీ తెలిపింది.