కవిత ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ16కి వాయిదా

కవిత ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ16కి వాయిదా
  • కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో వాదనలు
  • గత ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందన్న ధర్మాసనం
  • ఎమ్మెల్సీ పిటిషన్ ను​మరోసారి వాయిదా వేస్తూ తీర్పు

ఢిల్లీ: లిక్కర్​స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుదివిచారణ చేపట్టాలని ఆమె తరఫు లాయర్​కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది.

గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్‌ను ధర్మాసనం జతపరిచిన విషయం తెలిసిందే. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావడం లేదని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కవిత తరపు లాయర్​కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. అది ఒక్కసారికే పరిమితమని.. ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది పేర్కొన్నారు.

ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమన్నది తమ వాదనని కపిల్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే రోజు తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన​దాఖలు చేశారు.

సీఆర్పీఎస్ నిబంధనలు పాటించడం లేదని, ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదంటూ ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కవిత కోరారు.