- మద్యం షాపులకు లక్కీ డిప్ పూర్తి
- ఆయా షాపులకు సంబంధించిన టెండర్ దారుల సమక్షంలో డ్రా తీసిన కలెక్టర్లు
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు
మహబూబ్‌గర్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, వెలుగు : వైన్ షాపులను కొందరు 'లక్కీ' చాన్స్ కొట్టేశారు. ఆ షాపులపై గంపెడాశలు పెట్టుకున్న వారంతా 'బ్యాడ్ లక్' అంటూ నిరాశతో వెనుదిరిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 227 వైన్ షాపులకు ఇటీవల టెండర్లు పిలిచారు. మొత్తం 5,536 అప్లికేషన్లు వచ్చాయి. వీటికి సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీ డ్రా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే ఆయా షాపులకు కోసం టెండర్లు వేసిన వారంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్దకు చేరుకున్నారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణాలు వారి అనుచరులతో నిండిపోయాయి.
ఎలాంటి అనుమానాలకు తావులేకుండా లక్కీ డ్రా ప్రక్రియను ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో తీయించారు. అయితే దరఖాస్తుదారుల వెంట పెద్ద ఎత్తున సన్నిహితులు, బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. టోకెన్ కలిగిన వారిని మాత్రమే కలెక్టరేట్స్లోకి అనుమతించారు.
కలెక్టర్ల సమక్షంలో డ్రా..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన 90 వైన్ షాపులకు కలెక్టర్ విజయేందిర బోయి నేతృత్వంలో మహబూబ్ నగర్ కలెక్టరేట్లో లక్కీ డ్రా లక్కీ డ్రా తీశారు. ఒక్కో షాపువారీగా టెండర్ వేసిన వారి సమక్షంలోనే కలెక్టర్ టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి సమక్షంలో ఒక్కో షాపును డ్రా పద్దతి ద్వారా కేటాయించారు.
మొత్తం 36 దుకాణాలకు 757 దరఖాస్తులు రాగాలక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్సంతోష్సమక్షంలో లక్కీ డ్రా తీశారు. జిల్లాలోని 67 వైన్ షాపులకు 1518 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ దాఖలు చేసినవారి సమక్షంలో లక్కీ డ్రా తీసిన షాపులను కేటాయించారు. గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో వైన్ షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 34 మద్యం షాపులకు 774 దరఖాస్తులు వచ్చాయి. లక్కీ డ్రా తీస్తూ లిక్కర్ షాపులు కేటాయింపును
ఖరారు చేశారు.
భారీ బందోబస్తు ఏర్పాటు..
ఆయా కలెక్టరేట్లలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రాలో వైన్ షాపులు దక్కించుకున్న వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజును చెల్లించేందుకు వేదిక వద్దే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు.
