మద్యం దుకాణాలకు టెండర్లు వస్తలేవు

మద్యం దుకాణాలకు టెండర్లు వస్తలేవు
  •     దరఖాస్తు ఫీజు రూ.2లక్షలకు పెంచడంతో ఆసక్తి చూపని వ్యాపారులు
  •     హైదరాబాద్, రంగారెడ్డిలోని 59 వైన్ షాప్ లకు  ఒక్క అప్లికేషన్ కూడా రాలే
  •     నేటితో ముగియనున్న టెండర్ల దరఖాస్తు గడువు

రంగారెడ్డి జిల్లా/ ఇబ్రహీంపట్నం, వెలుగుమద్యం వాపారులు టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తులు ఇచ్చేందుకు నేడు చివరిరోజు కాగా..ఇప్పటివరకు కొన్ని మద్యం దుకాణాలకు ఒక్క టెండర్ దరఖాస్తు కూడా రాలేదని అధికారులు చెబుతున్నారు.  హైదరాబాద్‌‌‌‌ లోని 21, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 38 మద్యం దుకాణాలకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. మరోవైపు మద్యం వ్యాపారులు సిండికేట్‌‌‌‌గా మారి దరఖాస్తులు వేయని మద్యం దుకాణాలకు చివరి రోజు టెండర్లు వేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. గతంలో దరఖాస్తు ఫీజు రూ.లక్ష మాత్రమే ఉండేది. కానీ ఈఎండీ కింద జమానత్ కోసం మరో రూ.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌‌‌‌ చేసినట్లు చూపించాలి. ఈఎండీ కింద జమ చేసిన నగదు టెండర్‌‌‌‌ దక్కించుకోకుంటే తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం నూతన మద్యం పాలసీ ప్రకారం..దరఖాస్తు ఫీజు రూ.2లక్షలుగా నిర్ణయించారు. మద్యం టెండర్లల్లో ఎక్కువ శాతం మంది పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈ సారి ఈఎండీ లేకుండా దరఖాస్తు ఫీజును రూ.2లక్షలకు పెంచి పాలసీ రూపొందించారు. అయినప్పటికీ మద్యం టెండర్‌‌‌‌ దరఖాస్తులో వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

గతంలో పోలిస్తే తక్కువే..

గతంలో ఉమ్మడి హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాలో కలిపి 595 దుకాణాలకు 6,327 టెండర్‌‌‌‌ దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం వేస్తున్న టెండరు దరఖాస్తులు సగానికిపైగా దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 595 దుకాణాలకు 1,883 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 4 నుంచి 5 వార్డులను కలిపి ఒక క్లస్టర్‌‌‌‌గా ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్‌‌‌‌లో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తి ఆ ప్రాంతంలో ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు.

ఈ ప్రాంతాల్లో టెండర్లు నిల్

హైదరాబాద్‌‌‌‌ జిల్లాను  హైదరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ డివిజన్లుగా విభజించారు. హైదరాబాద్‌‌‌‌ పరిధిలో 6, సికింద్రాబాద్‌‌‌‌ పరిధిలో 5 యూనిట్లు ఏర్పాటు చేశారు.  హైదరాబాద్‌‌‌‌ పరిధిలోని 6 యూనిట్లల్లో 10 క్లస్టర్లు, సికింద్రాబాద్‌‌‌‌ పరిధిలోని 5 యూనిట్లల్లో 9 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌‌‌‌ డివిజన్‌‌‌‌లోని  6 యూనిట్లలో అమీర్‌‌‌‌పేట, జూబ్లీహిల్స్‌‌‌‌, నాంపల్లి, గోల్కొండ, చార్మినార్‌‌‌‌, దూల్‌‌‌‌పేట పరిధిలో  79 దుకాణాలకు 108  దరఖాస్తులు వచ్చాయి. అమీర్‌‌‌‌పేట, నాంపల్లి, గొల్కొండ యూనిట్లలో 6 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అదేవిధంగా సికింద్రాబాద్‌‌‌‌ డివిజన్‌‌‌‌లోని 5 యూనిట్లలో కాచిగూడ, మలక్‌‌‌‌పేట, ముషీరాబాద్‌‌‌‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌‌‌‌ పరిధిలో 94 దుకాణాలకు 132 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ముషీరాబాద్‌‌‌‌, కాచిగూడ, సికింద్రాబాద్‌‌‌‌ పరిధిలోని 15 దుకాణాలకు టెండర్ల దరఖాస్తులే లేవని అధికారులు వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 డివిజన్లలో 20 స్టేషన్లున్నాయి. శంషాబాద్‌‌‌‌, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌, మేడ్చల్‌‌‌‌, మల్కాజిగిరి, వికారాబాద్‌‌‌‌ ను డివిజన్లుగా ఏర్పాటు చేశారు. శంషాబాద్‌‌‌‌ లో 81 దుకాణాలకు 543, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌లో 114 దుకాణాలకు 404, మల్కాజిగిరిలో 82 దుకాణాలకు 221, వికారాబాద్‌‌‌‌లో 46 దుకాణాలకు 181 టెండర్‌‌‌‌ దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 422 దుకాణాలకు గాను 1,643 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్టు అధికారులు తెలిపారు. సరూర్‌‌‌‌నగర్‌‌‌‌, మేడ్చల్‌‌‌‌, మల్కాజిగిరి, వికారాబాద్‌‌‌‌ పరిధిలోని 38 దుకాణాలకు ఒక్క టెండర్‌‌‌‌ దరఖాస్తు కూడా రాలేదని అధికారులు వెల్లడించారు.మేడ్చల్​ జిల్లాలో మొత్తం 3 స్లాబ్ లలో ఉన్న 99 దుకాణాలకు ఇప్పటి వరకు 517 దరఖాస్తులు వచ్చినట్టు మేడ్చల్ డీపీఈవో గణేశ్​ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 18న డ్రా

ఈనెల 18న మద్యం షాపుల లాటరీ ద్వారా డ్రా తీయనున్నట్టు  జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కొంగర కలన్‌‌‌‌లోని చెట్లళ్ల కృష్ణయ్య గౌడ్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో మద్యం షాపుల దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  ఈ ఫంక్షన్ హాల్ లోనే  డ్రా పద్ధతిలో షాప్ లను కేటాయిస్తామన్నారు. శంషాబాద్ , శేరిలింగంపల్లి, చేవెళ్లకు సంబంధించిన దరఖాస్తులు 1,042 వచ్చాయన్నారు. జిల్లాలో మొత్తం 195 వైన్​ షాపులకు మొత్తం 1986  దరఖాస్తులందాయి. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఎక్సైజ్‌‌‌‌ అధికారులను ఆయన ఆదేశించారు.