లిక్కర్ షాపులొద్దంటూ జనాల లొల్లి

లిక్కర్ షాపులొద్దంటూ జనాల లొల్లి
  • పలు జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్న పబ్లిక్
  • ఇండ్లకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్
  • పట్టించుకోని ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కొత్త వైన్స్​షాపులను జనావాసాలు, స్కూళ్లు, టెంపుల్స్​దగ్గర ఏర్పాటు చేస్తుండడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో పట్టణాలు, మండల కేంద్రాలకే పరిమితమైన షాపులు ఇప్పుడు ఏకంగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. లిక్కర్​ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్నే నమ్ముకున్న ప్రభుత్వం ఏటికేడు షాపులు పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో చాలాచోట్ల కొత్త షాపులు పుట్టుకొచ్చాయి. కొత్త షాపులతో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలుగుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడి, గుడితో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ షాపులు ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రూల్స్​ ప్రకారం ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, టెంపుల్స్​కు వంద మీటర్ల దూరం వరకు వైన్స్​షాపులు ఏర్పాటు చేయకూడదు. ఎండోమెంట్​డిపార్ట్​మెంట్​పరిధిలోని టెంపుల్స్, గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు మాత్రమే ఈ రూల్​వర్తిస్తుంది. ఇదే అవకాశంగా వ్యాపారులు పలుచోట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

అన్ని జిల్లాల్లో ఆందోళనలు

  • నల్గొండ పట్టణం రామగిరి సెంటర్​లోని రామాలయానికి సమీపంలో ఉన్నటువంటి పాత బిల్డింగ్​లో వైన్స్​ఏర్పాటు చేస్తున్నారు. జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలో పైగా పాత బిల్డింగ్​లో వైన్స్​షాపు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 
  • మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట ఎల్ఐసీ ఆఫీస్ నుంచి సాయిబాబ గుడికి వెళ్లే మెయిన్​రోడ్డులో వైన్స్​ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్గంలో మహిళలు, స్టూడెంట్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ షాపును వేరొకచోటకు షిప్ట్​ చేయాలని స్థానికులు, వివిధ పార్టీల నాయకులు ఎక్సైజ్​ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం, రావువారిగూడెం విలేజ్ ల మధ్య శెట్టి పాలెం – సూర్యాపేట ప్రధాన రహదారి వెంట ఊరి నడిబొడ్డున ఏర్పాటు చేసిన వైన్స్ తొలగించాలని గ్రామస్తులు ధర్నా చేశారు.  దామరచర్ల మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ పక్కన ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్స్​ తొలగించాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. 
  • సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబంaడగూడెం గ్రామస్తులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. తమ విలేజ్ లో ఇప్పటివరకు కేవలం ఒక్క వైన్ షాప్ మాత్రమే ఉందని, కొత్తగా ఏర్పాటు చేసిన రెండో వైన్స్​తో గ్రామాల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉందని వాపోయారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఇప్పటివరకు వైన్స్​షాప్ లేదని, కొత్తగా షాప్​ను ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని, కేటాయించిన వైన్స్​ను రద్దు చేయాలంటూ ప్రజలు ఆందోళన చేశారు. పెన్ పహాడ్ మండలం అన్నారం బ్రిడ్జి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన వైన్స్ షాపు రద్దు చేయాలని ఆరు గ్రామాల సర్పంచులతో కలిసి స్థానిక ప్రజలు ఎక్సైజ్ ఆఫీసర్లను కోరారు. 
  • మెదక్​ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో రోడ్డు పక్కన కంటైనర్ లో వైన్స్ ఏర్పాటు చేశారు. ఆ రూట్లో డైట్, బీఈడీ కాలేజీ, మహాత్మా జ్యోతిబాపూలే బాయ్స్, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్, సమీపంలోనే ఎల్లమ్మ గుడి ఉన్నందున అక్కడ వైన్స్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంత రం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తిరుమలపూర్ లో వైన్స్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.  
  • ములుగు జిల్లా కేంద్రంలో పత్తిపల్లి రోడ్, కూరగాయల మార్కెట్ ప్రాంతంలో వైన్స్ ఏర్పాటు​ను మహిళలు అడ్డుకున్నారు. వెంకటాపురం విలేజ్​లో తమ వీధిలో షాప్​పెట్టొద్దని పాత మార్కెట్ సెంటర్ మహిళలు ఆందోళన చేశారు. 
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు సెంటర్ వద్ద వైన్ షాపు పెట్టొద్దని అల్లూరు యూత్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని జ్యోతి నగర్ లో  నివాసాల మధ్య వైన్ షాప్ పెట్టవద్దంటూ స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఇండ్ల మధ్య వైన్ షాప్ తొలగించాలని మహిళలు ధర్నా చేస్తున్నారు. పెద్దకొత్త పల్లి మండలం కల్వకోల్ గ్రామంలో వైన్ షాప్ తొలగించాలని గ్రామస్తుల ధర్నా చేశారు. 
  • నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలోని దుర్గామాత గుడి,  మార్కేండయ మందిరం సమీపంలో ఏర్పాటు చేసిన షాపులను తొలగించాలని నవీపేట్ మండల్ హెడ్ క్వార్టర్​లో పలు సంఘాలు ధర్నా చేశాయి.  

వ్యాపారులకే వంతపాడుతున్న ఆఫీసర్లు
జనాల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో, స్టూడెంట్ల రాకపోకలు ఉన్న బజార్లలో, గుడుల వద్ద షాపులు ఉండొద్దని ఓవైపు ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఎక్సైజ్​ఆఫీసర్లు,తహసీల్దార్లకు మెమోరాండంలు అందజేస్తున్నారు. అయితే ఆఫీసర్లకు మాత్రం ప్రజల గోడు పట్టడం లేదు. లక్షలు కుమ్మరించి షాపులు దక్కించుకున్న వ్యాపారులు లాభసాటిగా ఉండే ఏరియాల్లోనే షాపులు ఏర్పాటు చేసుకుంటారంటూ వారికే వంతపాడుతున్నారు. కనీసం సర్కారైనా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగని ప్రాంతాల్లో వైన్స్​ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.