రంగంలోకి లిక్కర్ సిండికేట్లు!..ఒక్కో వైన్స్కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఆఫర్

రంగంలోకి లిక్కర్ సిండికేట్లు!..ఒక్కో వైన్స్కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఆఫర్
  •     అప్లికేషన్ ​ఫీజు, రెండేండ్ల పాటు గుడ్​విల్​ ఇచ్చేందుకూ రెడీ 
  •     లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే సీన్​


నెట్​వర్క్, వెలుగు:  లాటరీలో వైన్ షాపులను దక్కించుకున్నవాళ్ల నుంచి షాపులను సొంతం చేసుకునేందుకు లిక్కర్ సిండికేట్లు రంగంలోకి దిగాయి. ప్రధానంగా అనుభవం లేని కొత్త వారిని సంప్రదిస్తూ, వారితో బేరసారాలు జరుపుతున్నాయి. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో చాలా ఏండ్లుగా లిక్కర్ ​బిజినెస్ చేస్తున్న ఓ సిండికేట్ గ్రూప్​కు ఈ సారి ఆశించిన స్థాయిలో షాపులు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన ఆ సిండికేట్​ సభ్యులు జిల్లావ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఈ బిజినెస్​లో ఎలాంటి అనుభవం లేకుండా కేవలం లక్కీడ్రాలో వైన్స్ దక్కించుకున్న వాళ్లకు ఎర వేస్తున్నారు. డిమాండ్​ను బట్టి రూ.50 లక్షల నుంచి కోటి దాకా ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజును వెనక్కి ఇవ్వడంతో పాటు లిక్కర్ బిజినెస్​ను బట్టి రెండేండ్ల పాటు గుడ్ విల్ చెల్లించడానికి కూడా రెడీ అయ్యారు. సిండికేట్లకు ఆశించిన స్థాయిలో షాపులు దక్కకపోవడంతో ఒక్క యాదాద్రిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. 


కొత్త ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పాలసీలో భాగంగా 2,620 లిక్కర్​షాపులకు రాష్ట్ర సర్కారు ఈ సారి టెండర్లు నిర్వహించింది. అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో పెద్దగా పోటీ ఉండదని సిండికేట్లు భావించారు. ఎప్పుడూ వేసే కంటే  తక్కువ అప్లికేషన్లు వేశారు. దీంతో ఈ సారి దాదాపు అన్ని జిల్లాల్లోనూ అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. గతంలో1.31 లక్షల అప్లికేషన్లు రాగా, ఈ సారి 95,137కే పరిమితమయ్యాయి. సిండికేట్లు ఊహించినట్లే అప్లికేషన్లు తగ్గినప్పటికీ వారికి ఆశించినన్ని షాపులు మాత్రం దక్కలేదు. దీంతో లక్కీ డ్రా ముగియగానే వారు షాపుల వెతుకులాటలో పడ్డారు. తమకు వైన్స్ కావాలని, ఎన్ని షాపులమ్మినా తీసుకుంటామని బేరసారాలకు దిగుతున్నారు. డిమాండ్​ను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. కోటి, ఆపైన కూడా ఆఫర్​చేస్తున్నారు. అదే సమయంలో అదృష్టవశాత్తూ షాపులు దక్కిన కొత్తవారికి ఈ రంగంలో అనుభవం లేకపోవడం, వ్యాపారంలో మెళకువలు తెలియకపోవడం సమస్యగా మారింది. దీనికి తోడు వచ్చే నెలలో మొదటి విడత చెల్లించాల్సిన ఫీజు ఇతర ఖర్చులు ​కలిపి  రూ.50 లక్షలు, ఆపైన పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఇంత చేస్తే అక్కడి లిక్కర్ సిండికేట్లు నెగలనిస్తారో లేదోనన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకని మంచి ఆఫర్ వస్తే లైసెన్స్ అప్పజెప్పేందుకు కొత్తవాళ్లలో చాలా మంది సిద్ధంగా ఉన్నారు. 


అన్ని జిల్లాల్లో ఇలాంటి సీన్లే.. 

  •  ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు ఎక్కువ జరిగే దుకాణాలను ఎలాగైనా దక్కించుకోవడానికి మద్యం సిండికేట్లు రంగంలోకి దిగాయి. మహారాష్ట్ర గడ్చిరోలి బార్డర్​లోని గూడెం మద్యం షాపు లక్కీ డ్రాలో కొత్తవారికి రావడంతో ఎంత అమౌంట్ అయినా ఇచ్చి దక్కించుకోవాలని సిండికేట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వైన్స్ కు రూ. కోటి గుడ్​విల్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్టు తెలిసింది. లాభాలు ఎక్కువగా వచ్చే ఇస్గాం, దహెగాం, వాంకిడి, కెరమెరి, తిర్యాణి దుకాణాలను కూడా మద్యం సిండికేట్ కొనుగోలు చేసేందుకు భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
  •  మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన 50 మంది సిండికేట్ గా మారి 70 వైన్స్ లకు దరఖాస్తు చేశారు. వారికి డ్రాలో కేవలం ఒకే ఒక్క షాప్ దక్కింది. దీంతో ఒక్క షాప్ తో వర్కవుట్ కాదని భావించిన వ్యాపారులు.. 25 లక్షల వరకు గుడ్ విల్ ఇస్తామని ఆశ చూపి మరో రెండు, మూడు షాపులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
  •  జనగామ టౌన్​లోని ఓ వైన్ షాప్ కోసం రెండు సిండికేట్లు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. డ్రాలో షాప్ దక్కించుకున్న వ్యక్తి దగ్గరకు మధ్యవర్తులను పంపి సిండికేట్​బేరసారాలు ప్రారంభించింది. తనకు రూ. 1.10 కోట్ల ఆఫర్ ఉందని, మీరెంత ఇస్తారని ఆ వ్యక్తి అడిగినట్టు సమాచారం. 
  •  భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట, పాల్వంచల్లోని షాపులకు సిండికేట్ వ్యాపారులు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆఫర్లు ఇస్తున్నారు. 
  • ఖమ్మం జిల్లాలో లిక్కర్ లైసెన్స్ దక్కించుకున్న వారికి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఆఫర్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా షాపు ఇవ్వకపోతే మెజార్టీ వాటా తమకు ఇవ్వాలని ప్రపోజల్స్ పెడుతున్నారు. ఖమ్మంలో బాగా బిజినెస్ జరిగే ఓ షాపు కోసం ఒక వ్యాపారి రూ.కోటితో పాటు ఇన్నోవా క్రిస్టా కారును ఆఫర్ చేశారు. మరో వైన్ షాపు కోసం ఆంధ్రాకు చెందిన వ్యాపారులు రూ. కోటిన్నర ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
  • భూపాలపల్లి టౌన్​లో ఒక షాపును దక్కించుకుంటే బిజినెస్ మొత్తం కంట్రోల్​లోకి వస్తుందని భావిస్తున్న సిండికేట్ వ్యాపారులు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు గుడ్​విల్ ఇస్తామని ఆఫర్​ ఇస్తున్నారు. రేగొండ షాపు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇచ్చి సొంతం చేసుకునేందుకు వ్యాపారులు రెడీగా ఉన్నారు. 
  • సూర్యాపేట జిల్లా కోదాడలో 18 షాపులకు టెండర్లు వేసిన సిండికేట్ కు ఒక్క షాపు దక్కలేదు. దీంతో ఒక్కో వైన్స్ కు రూ. 70 లక్షల చొప్పున రూ. 1.40 కోట్లు ఇచ్చి రెండు షాపులను కొనుగోలు చేశారు.
  •  వరంగల్ జిల్లా పరిధిలో తను, తన భార్య, అనుచరుడి పేరిట మూడు షాపులు పొందిన వ్యాపారి నాలుగో షాప్ కోసం సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. లక్కీడ్రాలో షాప్ దక్కించుకున్న వ్యక్తి గుడ్ విల్ కింద రూ.80 లక్షలు డిమాండ్ చేస్తుండగా.. రూ.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమై సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.  
  • ములుగు జిల్లాలోని ఒక షాపు కొత్తగా రంగంలోకి వచ్చిన గ్రూప్ కు దక్కింది. ఈ షాపును రూ. కోటి ఇచ్చి దక్కించుకునేందుకు సిండికేట్ వ్యాపారులు సిద్ధం కాగా.. వారు రూ.1.10 కోట్లు అడుగుతున్నట్టు సమాచారం. అలాగే ఇదే జిల్లాలోని మల్లంపల్లి వైన్స్ కు అత్యధికంగా 77 దరఖాస్తులు రాగా, వెంకటాపురం మండలానికి చెందిన సిండికేట్ కు ఆ షాపు దక్కింది.  
  • సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ కు చెందిన సిండికేట్ లాటరీ తగిలిన వ్యక్తికి రూ.కోటి ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. పటాన్ చెరు ఏరియాలోని ఒక షాపు కోసం సిండికేట్ 47 దరఖాస్తులు చేసుకున్నా దక్కలేదు. దాంతో షాప్ దక్కించుకున్న వ్యక్తికి రూ.కోటి నుంచి రూ.1.32 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారి ఆఫర్​కు అంగీకరించని వ్యక్తి భయంతో అజ్ఞాతంలో ఉన్నట్టు తెలిసింది. 
  • ఆదిలాబాద్ జిల్లాలో బడా వ్యాపారులే ఎక్కువగా మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి దరఖాస్తులు చేసుకొని షాపులు పొందిన వారికి గుడ్ విల్ ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. 
  • నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రెండు సిండికేట్లు భారీగా అప్లికేషన్లు పెట్టుకోగా రెండేసి షాపులు మాత్రమే దక్కాయి. దీంతో సొంతంగా షాపు పొందిన వ్యక్తితో సిండికేట్లు బేరసారాలు ప్రారంభించాయి. నాగర్​ కర్నూలులో 9 షాపులకుగాను పాత వాళ్లకు 6 షాపులు వచ్చాయి. మిగిలిన మూడు షాపులు పొందిన కొత్తవారితో సిండికేట్ సభ్యులు సంపద్రింపులు జరుపుతున్నారు.  
  • వనపర్తి జిల్లాలో ఉన్న 36 షాపుల్లో ఎక్కువగా కొత్త వారికే దక్కాయి. 9 మంది రాయలసీమ వాళ్ళు బినామీ పేర్ల మీద దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రాకు చెందిన వ్యక్తికి సిండికేట్​లో భాగంగా గోపాల్​పేట మండలంలో ఒక షాపు దక్కినట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు చెప్తున్నారు. 
  • నిర్మల్ జిల్లాలో గ్రామాల్లో షాపులు పొందిన వారితో సిండికేట్ గ్రూపులు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎక్కువ షాపులుంటే బిజినెస్ భారీగా ఉంటుంది. మద్యం కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తాయి. ఆఫర్లు ఇవ్వని కంపెనీల బ్రాండ్​లను వ్యాపారులు పక్కనపెట్టే అవకాశం ఉండడంతో సిండికేట్ల డిమాండ్లకు చాలా కంపెనీలు తలొగ్గుతాయి. అందుకే ఎక్కువ షాపులను దక్కించుకునే ఉద్దేశంతోనే కొత్త వ్యాపారులతో సిండికేట్లు బేరసారాలు మొదలుపెట్టాయి.