లక్ష ఆర్థిక సాయం కొంత మందికే

లక్ష ఆర్థిక సాయం కొంత మందికే
  • నియోజకవర్గానికి కేవలం 50 మందికి మాత్రమే..
  • పంపిణీకి ఎన్నికల కోడ్​ భయం
  • ఒకేసారి పంపిణీ చేయాలంటున్న లబ్ధిదారులు

నిర్మల్, వెలుగు: బీసీ కులాల్లోని చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం కోసం అప్లై చేసుకున్న అందరికీ అందేలా కనిపించడంలేదు. అధికారులు పంపిన ప్రపోజల్స్ కు అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు కాకపోవడంతో లబ్ధిదారుల జాబితాను కుదించి కొందరికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 14 వేల 500 మంది ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇందులో నుంచి 11 వేల 600 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. సంబంధిత ఎమ్మెల్యేలు అర్హులైన వారిని ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దశల వారీగా నిధులు అందించేందుకు అధికారులు జాబితా 
రూపొందించారు.  

మొదట 300 మంది కోసం జాబితా

అయితే, ప్రభుత్వం సూచించిన విధంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి 900 మందిని ఎంపిక చేయాలని అధికారులు మొదట నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున ఎంపిక చేయాలని భావించారు. దీనికి అనుగుణంగా జాబితా సైతం తయారు చేసి,  రావాల్సి ఫండ్స్​ కోసం ప్రభుత్వానికి నివేదించారు. అయితే, ప్రభుత్వం కేవలం రూ. కోటి 50 లక్షలు మాత్రమే విడుదల చేయడంతో అధికారులు షాక్​కు గురయ్యారు. దీంతో చేసేదేమీ లేక విడుదలైన నిధులు కనుగుణంగా మళ్లీ కొత్త జాబితాను తయారు చేస్తున్నారు. నియోజకవర్గానికి కేవలం 50 మందికి మాత్రమే ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ ఎంపికలోనూ రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు జాబితాను సవరించిన అధికారులు.. నేతల సిఫారసులకు అనుగుణంగా మొదటి దశ కోసం మరో జాబితాను రూపొందిస్తున్నారు.

లబ్ధిదారుల ఎదురుచూపులు

అర్హుల జాబితాలో తమ పేరు ఉందన్న సమాచారంతో సంతోషపడ్డ లబ్ధిదారులకు దశలవారీ పంపిణీ నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. మొదటి దశ కింద ఎంపికైన వారికి ఇంకా నిధులు అందించకపోవడంతో వారంతా నారాజ్​ అవుతున్నారు . ప్రతి నెల 15వ తేదీన ఈ నిధులను అందిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, మరికొద్ది నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో ఎన్నికల కోడ్ వస్తే పంపిణీ ఆగిపోతుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ వంతు వచ్చేవరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా కాకుండా ఒకేసారి అర్హులందరికీ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.