కూతురు కళ్లల్లో ప్రపంచాన్ని చూస్తున్న తల్లిదండ్రులు

కూతురు కళ్లల్లో ప్రపంచాన్ని చూస్తున్న తల్లిదండ్రులు

పిల్లలు సంతోషంగా ఉండాలని.. వారు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్ధిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అందుకోసం తమ కోరికలను త్యాగం చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్నా.. తమ పిల్లల కోసం ఆలోచిస్తుంటారు. అయితే... కొంతమంది మాత్రం తల్లిదండ్రులను పట్టించుకోరు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమవుతారు. కానీ.. ఓ బాలిక.. అంధులైన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకొంటోంది. 

ముంబై మీరా రోడ్‌లో ఓ దుకాణం ఎదుట స్కూల్ యూనిఫాంలో ఓ బాలిక టిఫిన్ చేస్తోంది. అక్కడనే దృష్టి లోపం ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తాను తింటూ.. వారికి ఆహారాన్ని పెట్టింది. టిఫిన్ చేశాక తనతో కలిసి వారిని తీసుకెళ్లింది. ఈ వీడియోని @mith_mumbaikar.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మొదటిసారి చూసినప్పుడు  భావోద్వేగానికి గురయినట్లు @mith_mumbaikar రాసుకొచ్చారు. ‘ప్రతిరోజూ ఈ దుకాణానికి రావడం చూస్తున్నాను. తల్లిదండ్రులు అంధులు.. కానీ వారు తమ కుమార్తె కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ చిన్న అమ్మాయి చాలా విషయాలు నేర్పింది’,  అంటూ వెల్లడించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారిని అభినందిస్తున్నారు.