క్వారీల్లో కనిపించని భద్రత

క్వారీల్లో కనిపించని భద్రత
  •     తరచుగా జరుగుతున్న ప్రమాదాలు
  •     ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు
  •     సేఫ్టీ మెజర్స్‌‌ పాటించని నిర్వాహకులు

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లాలోని క్వారీల్లో పనిచేసే కార్మికుల జీవితాలకు రక్షణ లేకుండా పోతోంది. క్వారీల నిర్వాహకులు సేఫ్టీ మెజర్స్‌‌ పాటించకపోవడంతో కార్మికులు తరచూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. 

జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన 13 కంకర, 131 గ్రానైట్‌‌ క్వారీలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా కార్మికుల రక్షణకు అవసరమైన చర్యలు లేకపోవడంతో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌‌లు చేయడం, మట్టి తవ్వడం, గ్రానైట్‌‌ రాళ్ల తరలింపులో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జిలెటిన్‌‌ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు వినియోగించడం, ఆ టైంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

బ్లాస్టింగ్‌‌ నిర్వహించే ముందు పోలీస్‌‌, రెవెన్యూ, ఫైర్‌‌ డిపార్ట్‌‌మెంట్ల నుంచి పర్మిషన్‌‌ తీసుకోవాల్సి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కొన్ని క్వారీలకు మాత్రమే బ్లాస్టింగ్‌‌ పర్మిషన్‌‌ ఉన్నప్పటికీ పేలుళ్ల టైంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. 

రూల్స్‌‌ బేఖాతర్‌‌

క్వారీల్లో పని చేసే కార్మికులకు ప్రత్యేక యూనిఫామ్‌‌, హెల్మెట్‌‌, షూ, అద్దాలు, హ్యాండ్‌‌ గ్లౌజ్‌‌లు అందించాలి. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే బ్లాస్టింగ్‌‌ చేయడంతో పాటు బ్లాస్టింగ్‌‌ ముందు సైరన్‌‌ మోగించాలి. అలాగే బ్లాస్టింగ్‌‌ ప్లేస్‌‌కు 250 మీటర్ల దూరం వరకు పశువులు, మనుషులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో మాత్రమే బ్లాస్టింగ్‌‌లు చేయాలి. రాళ్లను లారీల్లోకి చేర్చే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పరిమితికి మంచి రాళ్లను తరలించొద్దని రూల్స్‌‌ ఉన్నా నిర్వాహకులు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కార్మికులతో రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయించాలని, వారికి ప్రమాద బీమా, పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ సౌకర్యం కల్పిచాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు

    సెప్టెంబర్‌‌ 13న తీగలవేణి గ్రామ సమీపంలోని ఓ గ్రానైట్‌‌లో బాంబ్‌‌ బ్లాస్టింగ్‌‌ కారణంగా అమీర్‌‌పాషా అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. 
    జూన్‌‌ 6న నెల్లికుదురు మండలం మీఠ్యా తండా సమీపంలోని క్వారీలో ట్రాక్టర్‌‌ బోల్తా పడడంతో పసునూరి శ్రీను మృతి చెందాడు.
    2022 డిసెంబర్‌‌ 31న కురవి మండల సమీపంలో లారీ పైనుంచి గ్రానైట్‌‌ రాయి జారి పడడంతో చిన్నగూడురుకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు.
    2020 జనవరి 20న నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం సమీపంలోని క్వారీలో ట్రాక్టర్‌‌ నడుపుతున్న గుండెబోయిన రాజు చనిపోయాడు. అలాగే బ్లాస్టింగ్‌‌ సమయంలో పలు పశువులు సైతం చనిపోయాయి.

కార్మికులకు రక్షణ కల్పించాలి 

క్వారీల్లో పని చేసే కార్మికులకు సరైన రక్షణ, ప్రమాద బీమా, పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కార్మికులకు రోజు వారి కూలీ మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన, మరణించిన వాళ్ల కుటుంబాలకు తాత్కలిక సాయం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలి.
-
 బానోత్‌‌ వెంకన్న, కార్మికుడు, ఎర్రబెల్లిగూడెం

రూల్స్‌‌ పాటించాలి 

జిల్లాలోని క్వారీల ఓనర్లు తప్పనిసరిగా రూల్స్‌‌ పాటించాలి. పర్మిషన్‌‌ తీసుకోకుండా బ్లాస్టింగ్‌‌ నిర్వహిస్తే చర్యలు తప్పవు. కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి. రూల్స్‌‌ పాటించని వారికి ఫైన్‌‌ విధించడంతో పాటు, కేసులు పెడుతాం.
-
 రవీందర్, మైనింగ్‌‌ ఏడీ, మహబూబాబాద్‌‌