ఆర్థిక ఎజెండాను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యా: ట్రస్

ఆర్థిక ఎజెండాను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యా: ట్రస్

లండన్: ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న బ్రిటన్​లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధానమంత్రి లిజ్​ట్రస్​ తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకునే వరకు ట్రస్​ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే వారంలోపుగా ట్రస్​ వారసుడిని కన్జర్వేటివ్​ పార్టీ నాయకత్వం ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రధాని పదవి రేసులో ట్రస్​తో పోటీ పడ్డ రిషి శునక్​ ముందు వరుసలో ఉన్నారు. అయితే మరిన్ని పేర్లు తెరపైకి వస్తుండటంతో కన్జర్వేటివ్​ పార్టీలో ప్రధాని అభ్యర్థిపై ఏకాభిప్రాయం రావడం కష్టంగానే కనిపిస్తోంది. దేశంలో తాజా పరిణామాల నేపథ్యంలో వెంటనే జనరల్​ ఎలక్షన్లు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్​ పార్టీ డిమాండ్​ చేస్తోంది.

ఫెయిల్​ అయ్యా: ట్రస్​

గురువారం సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ లో తన నిర్ణయాన్ని ట్రస్​ అధికారికంగా ప్రకటించారు. ‘‘కన్జర్వేటివ్ పార్టీ నాకు అప్పగించిన మ్యాండేట్​ను అందించలేకపోయా. నా వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయి. రాజీనామా గురించి కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడాను. టోరీ లీడర్​షిప్​ ఇన్​చార్జ్, 1922 కమిషన్​ చైర్​ సర్ గ్రాహం బ్రాడీని కూడా కలిశాను. వచ్చే వారంలోగా నాయకత్వ ఎన్నికలు పూర్తవుతాయని మేం భావిస్తున్నాం. ఇది మా ఆర్థిక ప్రణాళికలను కొనసాగించడానికి, దేశ ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. తదిపరి ప్రధానిని ఎన్నుకునే వరకు నేను పదవిలో కొనసాగుతాను’’ అని ట్రస్ చెప్పారు. అస్థిర పరిస్థితులు ఉన్న సమయంలో తాను బాధ్యతలు చేపట్టానని, అయితే తన ఆర్థిక ఎజెండాను అందించే మిషన్​లో ఫెయిల్​ అయ్యానని ఆమె అంగీకరించారు.

జనరల్​ ఎలక్షన్స్​ పెట్టాలి: లేబర్​ పార్టీ

కాగా, దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేబర్​ పార్టీ లీడర్​ సర్​ కైర్​ స్టార్​మర్​ డిమాండ్​ చేశారు. అధికార పార్టీలో అంతర్గత పోరాటానికి ముగింపు పలకాలంటే ఎన్నికలు పెట్టడమే మార్గమని చెప్పారు. గత పన్నెండేండ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వైఫల్యాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు.

45 రోజులకే..

ట్రస్​ బ్రిటన్​కు మూడో మహిళా ప్రధానమంత్రి. మార్గరెట్​ థాచర్, థెరిసా మే తర్వాత ఆ పదవి చేపట్టారు. అయితే ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. బ్రిటన్​లో అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ప్రధాని ట్రస్. ఆమె 45 రోజులు మాత్రమే ప్రధాని పీఠంపై ఉన్నారు. ఆమె కంటే ముందు 1827లో జార్జ్​ కేనింగ్​ 121 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆయన తన ఆఫీసులోనే కన్నుమూశారు.  వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దే పరిస్థితి లేదంటూ వారం కిందట బ్రిటన్ ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. బుధవారం బ్రిటన్​ కేబినెట్​ నుంచి సుయేలా బ్రేవర్​మన్​ తప్పుకున్నారు. ట్రస్​ నిర్ణయాలను తప్పుబడుతూ ఆమె విడుదల చేసిన లేఖ ప్రకంపనలు రేపింది. అది చివరికి ట్రస్​ రాజీనామాకు దారి తీసింది.

రేసులో రిషి శునక్

ప్రధాని పదవి రేసులో ట్రస్​తో పోటీపడిన శునక్ ముందున్నారు. అలాగే గతంలో పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, సుయేలా బ్రేవర్​మన్, యూకే రక్షణ మంత్రి బెన్​ వాలెస్​ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు బొరిస్​ జాన్సన్​ తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలు లేకపోలేదని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. 2019 జనరల్​ ఎలక్షన్స్​లో జాన్సన్​కు ప్రజలు పట్టం కట్టారని, ఆయనకు తిరిగి పదవి కట్టబెట్టాలని అంటున్నారు. ట్రస్​ మాదిరిగానే పార్టీలో అంతర్గత పోరుతో జాన్సన్​ కూడా పదవికి రిజైన్ చేయాల్సి వచ్చింది. అయితే టోరీ సభ్యుల మధ్య అంతర్గత పోరుతో ట్రస్​ వారసుడిని ఎన్నుకోవడంపై మాత్రం స్పష్టత లేదు.