
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.21 వేల కోట్లే మాఫీ
- మేము ఆరు నెలల్లోనే రూ.31వేల కోట్లు మాఫీ చేసినం
- పీసీసీ చీఫ్ రేసులో నేను లేను
- మీడియాతో చిట్‌చాట్‌లో ఇరిగేషన్ మినిస్టర్
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రుణమాఫీ చేస్తుండటం చారిత్రాత్మకమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రూ.31 వేల కోట్ల రుణాలను వచ్చే నెల 15 కల్లా మాఫీ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ గత పదేండ్లలో కేవలం రూ.21వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉత్తమ్ కృతజ్ఞత తెలిపారు.
మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘ఇప్పటికే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశాం. మాఫీ కాని రైతులకు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రైతుబంధు ఆపి రుణమాఫీ చేశారన్న వార్తలు అవాస్తవం. రైతు బంధు కూడా ఇస్తాం. రుణమాఫీ విషయాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే దృష్టికి తీసుకెళ్లాం. అందరూ ఎంతో సంతోషించారు. బడ్జెట్ సమావేశాల కారణంగా అందరూ బిజీగా ఉన్నరు. త్వరలోనే రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తాం’’అని అన్నారు.
మేడిగడ్డ కట్టింది వాళ్లే..కూలిందీ వాళ్ల హయాంలోనే..
‘‘పీసీసీ చీఫ్ రేసులో నేను లేను. మరోసారి ఆ పదవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రాష్ట్రంలో అమలవుతున్న స్కీమ్‌లకు నిధులు ఇవ్వాలని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కోరాం. మేడిగడ్డ బ్యారేజీ కట్టింది కేసీఆర్ హయాంలోనే.. కూలింది కూడా వాళ్ల పాలనలోనే.. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ముందుకు వెళ్తాం. వరద వస్తే మూడు బ్యారేజీ గేట్లు ఎత్తేశాం. ఈ అంశంపై కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు’’అని ఉత్తమ్ అన్నారు.
ALSO READ : ఫ్యాక్టరీలో గోల్ మాల్: తీసుకోని లోన్కు రుణమాఫీ మెసేజ్లు.. షాకైన రైతులు
కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో గైడ్‌లైన్స్ జారీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు వేర్వేరుగా ఇస్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నియమించి మంత్రివర్గంలో చర్చిస్తామని తెలిపారు. పదేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని ఉత్తమ్ మండిపడ్డారు. నల్లగొండ నుంచి మరొకరికి కేబినెట్ హోదా, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కామెంట్ల వ్యవహారంపై ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేశారు.