
- ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసిన ఆఫీసర్లు
- రిజర్వేషన్లు పెరగడంతో బీసీ లీడర్లలో జోష్
- కోలాహలంగా మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు
మహబూబ్‌నగర్, వెలుగు :లోకల్‌బాడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో రిలీజ్ కావడంతో ఎన్నికలకు రూట్ క్లియర్ అయ్యింది. రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు.. ఆ తర్వాత మూడు విడతల్లో సర్పంచ్, వార్డ్ మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 9న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబరు 11 వరకు పూర్తికానుంది.
జనవరి నుంచే ఏర్పాట్లు
ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్రావచ్చునన్న సంకేతాలతో జిల్లా అధికారులు గత జనవరి నుంచే ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోడల్ ఆఫీసర్లను నియమించారు. మాన్ పవర్, బ్యాలెట్ బాక్స్, రవాణా, శిక్షణ, సామగ్రి, ఎంసీఎంసీ మేనేజ్మెంట్, ఎక్స్పెండీచర్ అకౌంట్స్, ఎక్స్పెండీచర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ తదితర 12 విభాగాలకు 12 మంది జిల్లా ఆఫీసర్లను ఇన్చార్జిలుగా నియమించారు. ఫిబ్రవరిలోనే టెండర్లు పిలిచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తి చేశారు. ఎలక్షన్ల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు.
ఉత్సాహంలో బీసీ లీడర్లు
రిజర్వేషన్లు 42 శాతానికి పెరగడంతో బీసీ లీడర్లు ఉత్సాహంలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 77 జడ్పీటీసీ స్థానాలుండగా.. బీసీలకు 32 స్థానాలు దక్కనున్నాయి. ఇందులో బీసీ జనరల్‌కు 17, బీసీ మహిళలకు 15 స్థానాలు కేటాయించారు. 32 మండల పరిషత్ అధ్యక్ష పదవులు బీసీలకే దక్కనున్నాయి. ఐదు జిల్లా పరిషత్‌లలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జడ్పీ బీసీలకు, గద్వాల ఎస్సీకి, నారాయణపేట జనరల్ కానున్నట్టు చర్చ జరుగుతోంది.
కోలాహలంగా క్యాంపు ఆఫీసులు
ఎన్నికల షెడ్యూల్ రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు స్థానిక నేతలతో కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన నేతలు క్యాంపు ఆఫీసుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని స్థానాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది టికెట్ కోరుతుండడంతో పోటీ నెలకొంది. తమకు మొదటి నుంచి మద్దతుదారులుగా ఉన్న లీడర్లను పోటీ చేయించి గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు.
కొత్తగా పార్టీలో చేరిన నేతలు కూడా తమకు టికెట్ట్లు ఇవ్వాలని పట్టుబడుతుండడంతో చాలాచోట్ల సమస్యలు ఎదురవుతున్నట్టు సమాచారం. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం సాధించి ఏకాభిప్రాయంతో బరిలోకి దిగేలా మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.