
- స్థానిక సంస్థల ఎలక్షన్స్ అత్యవసరం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోను స్వాగతిస్తున్నం
- బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు..
- జాతీయస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా 9వ షెడ్యూల్‌లో చేర్చలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలు జరగడం అత్యవసరమని, అవి జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. 42% రిజర్వేషన్లకు తమ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తున్నదని, ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవోను స్వాగతిస్తున్నామని చెప్పారు.
గతంలోనే ఈ జీవో ఇచ్చి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం ఇన్నాళ్లూ సాకులతో కాలయాపన చేసిందని విమర్శించారు. సోమవారం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. కోర్టుకు వెళ్లిన వారెవరో తమకు తెలియదని, ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందనే తాము నమ్ముతున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనను చూశారని, కాంగ్రెస్ పాలనను చూశారని, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాజా రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం లేనందునే తాము అడ్డుచెప్పడం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని రాంచందర్రావు తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
బీసీ బిల్లులకు 2 సార్లు సంపూర్ణ మద్దతిచ్చాం..
బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, జాతీయస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా 9వ షెడ్యూల్‌లో చేర్చలేదని రాంచందర్‌రావు తెలిపారు. ఇదే విషయాన్ని గతంలోనే చెప్పామని అన్నారు. బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించేలా బీజేపీ నేతలు చొరవ చూపాలంటూ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌రావును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గణేష్ చారి, విక్రంగౌడ్, సంఘని మల్లేశ్వర్, శ్రీనివాస్ ముదిరాజ్‌తోపాటు పలువురు నేతలు కలిశారు.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నదన్నారు. తమ పార్టీ నుంచి బీసీ బిల్లులకు 2 సార్లు సంపూర్ణ మద్దతు తెలియజేశామని గుర్తుచేశారు. కాగా, రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు మద్దతు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు తర్వాత సైలెంట్ అయ్యారని జాజుల పేర్కొన్నారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపి నెల రోజులు అవుతున్నా ఇంత వరకు ఆమోదించలేదన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి.. బిల్లును ఆమోదించేలా కోరాలని రాంచందర్‌రావును జాజుల కోరారు. బీసీ సంఘాలు ఇచ్చిన వినతిని రాష్ట్ర పార్టీ కోర్ కమిటీలో చర్చించి, గవర్నర్‌ను కలిసే ప్రయత్నం చేస్తామని రాంచందర్‌రావు హామీ ఇచ్చారు.