
ప్రైవేటు వర్సిటీల్లో ‘లోకల్’లొల్లి
వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొదలుకానున్న ప్రైవేటు వర్సిటీలు
ఇక్కడి స్టూడెంట్స్‌కు అన్యాయం: విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యాసంవత్సరం స్టేట్‌లో ప్రారంభం కానున్న ప్రైవేటు యూనివర్సిటీల్లో ‘లోకల్’ కోటాపై లొల్లి మొదలైంది. తెలంగాణలో కేవలం రెండేండ్లుంటే లోకల్‌గా కన్సిడర్ చేస్తామని స్టేట్ గవర్నమెంట్ చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల రాష్ర్ట విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే వాదన మొదలైంది. అయితే ప్రభుత్వం ఏ లెక్క ప్రకారం ‘రెండేండ్లు’ అనే అంశాన్ని తెరమీదికి తెచ్చిందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2018ని గతేడాది జూలై నుంచి అమల్లోకి తెచ్చారు. 2018లోనే అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం బిల్లు పాస్ అయినా, గెజిట్ నోటిఫికేషన్ ఏడాది తర్వాత విడుదల చేశారు. దీని విధివిధానాలను గతేడాది ఆగస్టు 20న ప్రభుత్వం రిలీజ్చేసింది. జీవో నెంబర్ 26లోని రూల్పదిలో వర్సిటీల్లో సీట్ల కేటాయింపుతో పాటు స్థానికత గురించి వివరించారు. దీని ప్రకారం వర్సిటీల్లోని సీట్లలో 25శాతం సీట్లు తెలంగాణ వాళ్లకే ఇవ్వాలని పేర్కొన్నారు. దీంట్లోనే ‘లోకల్’ అనేదానికి కొత్త అర్థం చెప్పారు. తెలంగాణలో కనీసం రెండేండ్లు చదివిన స్టూడెంట్స్‌ను లోకల్‌గా పరిగణించాలని, కనీసం రెండేళ్లు పనిచేసిన వ్యక్తుల పిల్లలు కూడా స్థానికులుగా ప్రైవేటు యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకోవచ్చని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని స్టూడెంట్స్ యూనియన్ల నేతలు వాదిస్తున్నారు. దీనివల్ల లోకల్ స్టూడెంట్స్‌కు నష్టం కలుగుతుందంటున్నారు.
తప్పుడు పేపర్లు తీసుకొస్తే..
ఇప్పటికే 11 ప్రైవేటు సంస్థలు స్టేట్‌లో యూనివర్సిటీలు పెట్టేందుకు ప్రభుత్వానికి అప్లై చేశాయి. దీంట్లో టెక్‌మహీంద్ర, వాక్సన్, శ్రీనిధి, మల్లారెడ్డి, ఎస్ఆర్, అమిటీ, అనురాగ్, గురునానక్, నిక్మార్, రాడ్‌క్లిఫ్, ఎంఎన్ఆర్ తదితర సంస్థలున్నాయి. వీటిలో 10 సంస్థలకు చెందిన రిపోర్టులు కూడా సర్కారుకు చేరాయని అధికారులు అంటున్నారు. త్వరలో వారి పర్మిషన్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. గవర్నమెంట్అనుమతిస్తే 2020–21లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అయితే ఇందులో రెండేండ్లు స్థానికత ఎలా చూపించాలనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో ఆయా వర్సిటీల్లో నిజంగానే సీట్ల డిమాండ్ఉంటే ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసినట్టు తప్పుడు పేపర్లు తీసుకొచ్చి, లోకల్స్గా పేర్కొనే అవకాశముందనే వాదనలూ ఉన్నాయి.
తెలంగాణలోనూ స్థానికులకు అన్యాయం: శంకర్, ఓయూ జేఏసీ నేత
ఉమ్మడి రాష్ర్టంలో జరిగినట్టే తెలంగాణ స్టేట్‌లోనూ లోకల్స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతుంది. రెండేండ్లు ఉంటే లోకల్ అనే రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం స్థానిక విద్యార్థులను మోసం చేస్తుంది. పక్క రాష్ర్టాల వారికి సీట్లు కట్టబెట్టేందుకే ఈ ఆర్డర్స్ తీసుకువచ్చారు. కొత్త గెజిట్ ప్రకారం 95శాతం లోకల్ వారికి అవకాశమివ్వాలి. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
రెండేండ్లుంటే లోకల్ఎట్లా?
ఆర్టికల్371(డి) ప్రకారం 85శాతం లోకల్, 15 నాన్ లోకల్ కోటాలో రిజర్వేషన్లుంటాయి. కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదనే వాదనలున్నాయి. దీనికి సవరణ చేస్తూ సర్కారు 2018లో ప్రభుత్వం గెజిట్ తెచ్చింది. దీని ప్రకారం 95శాతం లోకల్, కేవలం 5 శాతం మాత్రమే నాన్ లోకల్ కోటా ఉంటుంది. ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా కేవలం 25శాతం లోకల్రిజర్వేషన్ అని ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలు వద్దనే డిమాండ్ మొదటి నుంచిబలంగా ఉన్నది. అయినా ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో లోకల్ కోటాపై స్పష్టత లేని ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. అయితే చాలా రాష్ర్టాల్లోని ప్రైవేటు వర్సిటీల్లో ‘లోకల్’కోటా కూడా లేదని ప్రభుత్వ పెద్దలు, అధికారులు వాదిస్తున్నారు.
For More News..