తడిసి మోపెడవుతున్నగాడ్జెట్ల రిపేర్​ ఖర్చులు 

తడిసి మోపెడవుతున్నగాడ్జెట్ల రిపేర్​ ఖర్చులు 
  • లోకల్ ​సర్కిల్ ​సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: పాడయిన గాడ్జెట్ల రిపేర్​ ఖర్చులు తడిసి మోపెడవుతున్నట్లు కన్జూమర్లు చెబుతున్నారు. బ్రాండెడ్​ ల్యాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్లు వంటి టెక్నాలజీ గాడ్జెట్లు మూడుకి మించి తమ ఇంట్లో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. లోకల్​ సర్కిల్స్​ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని 43 శాతం ఇళ్లల్లో మూడు లేదా అంతకు మించిన గాడ్జెట్లు ఉన్నాయని ఇందులో తేలింది. ఇవన్నీ అయిదేళ్లలోపు కొన్నవేనని ఆ కన్జూమర్లు చెప్పారని లోకల్​ సర్కిల్స్​ తన రిపోర్టులో పేర్కొంది.

ఆయా ల్యాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్లకు రిపేర్లు అవసరమేనని వారు చెబుతున్నట్లు వివరించింది. బ్రాండెడ్​  డివైస్​ల రిపేర్​ ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయని, దీంతో కొత్త డివైస్​లు కొనుక్కుంటున్నట్లు కన్జూమర్లు ఈ సర్వేలో చెప్పారు. ఇంట్లో అయిదేళ్లలోపు కొన్న డివైస్​లు (ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​, టాబ్లెట్​, స్మార్ట్​ఫోన్​, ప్రింటర్​) ఉన్నాయా అనే ప్రశ్నకు వచ్చిన సమాధానాలను ఎనలైజ్​ చేసినట్లు లోకల్​ సర్కిల్స్​ వెల్లడించింది. పాడైన డివైస్​లను  లోకల్​గా సర్వీస్​ చేయించుకోవాలన్నా, కంపెనీలకు పంపి సర్వీసు చేయించుకోవాలన్నా కష్టతరంగా మారడంతో కొత్త వాటినే కొనుక్కోవడం మేలనే నిర్ణయానికి కన్జూమర్లు వస్తున్నట్లు వివరించింది. దేశంలోని 309 జిల్లాల నుంచి 34000 మంది కన్జూమర్లు ఈ సర్వేలో భాగం పంచుకున్నట్లు పేర్కొంది.

భాగం పంచుకున్న వారిలో 61 శాతం  మంది పురుషులుండగా, 39 శాతం మంది మహిళలూ ఉన్నారని లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. దేశంలో రిపేర్​ సర్వీస్​విషయంలో కన్జూమర్ల ఇబ్బందులు పరిష్కరించడానికి కన్జూమర్​ ఎఫెయిర్స్​ మినిస్ట్రీ ఒక ఫ్రేమ్​వర్క్​ తేవాలనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో లోకల్​ సర్కిల్స్​ ఈ సర్వేను నిర్వహించడం విశేషం. మాన్యుఫాక్చరర్లందరూ తమ ప్రొడక్టుల డిటెయిల్డ్​ డ్రాయింగ్స్​ను వాటిని అమ్మేటప్పుడే కన్జూమర్లకు ఇవ్వాలని, అప్పుడే డివైస్​ల రిపేర్లకు మాన్యుఫాక్చరర్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని మినిస్ట్రీ అభిప్రాయపడుతోంది.  ఈ ఏడాది ఏప్రిల్​ 10 నుంచి జులై 9 మధ్యలో సర్వే నిర్వహించగా, టైర్​ 1 సిటీల నుంచి 47 %, టైర్​ 2 సిటీల నుంచి 31 %  మంది కన్జూమర్లు పాల్గొన్నారు.