దుబ్బాకలో టీఆర్​ఎస్​కు అసమ్మతి సెగ

దుబ్బాకలో టీఆర్​ఎస్​కు అసమ్మతి సెగ
  • తమను పట్టించుకోవడంలేదని లోకల్​ లీడర్ల గుస్సా
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆవేదన
  • సోలిపేట కొడుకుకు వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు
  • ప్రతి మండలంలో భారీగా అసంతృప్తులు

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బై ఎలక్షన్​లో టీఆర్ఎస్​కు అసమ్మతి పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకూ అసమ్మతి కుంపటి రాజుకుంటున్నది. ఆ లీడర్లను దారిలోకి తెచ్చుకునేందుకు పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. పార్టీ విజయం కోసం కృషి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నట్టు స మాచారం.  అయినా కొందరు మాట వినకపోవడంతో పాత కేసులను గుర్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. దుబ్బాక బై ఎలక్షన్​లో గెలుపే లక్ష్యంగా 20 రోజుల కిందనే ఉమ్మడి మెదక్  జిల్లా ఎమ్మెల్యేలను టీఆర్​ఎస్​ రంగంలోకి దింపింది. వీరికి ఒక్కో మండలం బాధ్యతలు అప్పగించింది. వారు ఎప్పటికప్పుడు పార్టీకి రిపోర్టు ఇస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం పది మంది లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది.

నిలదీస్తున్న లోకల్​ లీడర్లు

ఇన్నాళ్లూ దుబ్బాక సెగ్మెంట్ ను పట్టించుకోలేదన్న ఆవేదన చాలా మంది లోకల్ లీడర్లలో ఉంది. అభివృద్ధి విషయంలో లీడర్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఇన్​చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్పుకోలేకపోతున్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మాకు ఏం చేసింది? పోనీ  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? పక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట మాదిరిగా ఎందుకు పట్టించుకోలేదు?’’అని వారు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

బుజ్జగిస్తున్న మంత్రి హరీశ్

అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో మంత్రి హరీశ్ రావు ఉన్నారు. ఒక్కొక్కరిని ఆయన పిలిచి మాట్లాడుతున్నారు. వారికి భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి కుటంబానికి టికెట్ ఇస్తే పనిచేయబోమని చెప్పిన నేతలతో ఆయన రోజూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. రామలింగారెడ్డి తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని, మళ్లీ ఆయన కుటంబసభ్యుల విజయం కోసం ఎందుకు పనిచేయాలని కొందరు లీడర్లు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. రామలింగారెడ్డి సొంతూరు చిట్టాపూర్ లో కూడా అసంతృప్తి రాగం వినిపించడంతో వారినీ బుజ్జగించే పనిలో మంత్రి ఉన్నట్టు తెలిసింది. కొందరు లీడర్లు.. రామలింగారెడ్డి కొడుకు సతీశ్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించి పార్టీ పెద్దలకు రిపోర్టు చేసినట్లు నేతలు
చర్చించుకుంటున్నారు.

కండిషన్లు పెడుతున్న ముత్యంరెడ్డి కొడుకు 

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన తమకు సరైన గుర్తింపు లేదని మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఆవేదనలో ఉన్నారు. ఈ బై ఎలక్షన్​లోనే టికెట్ ఇవ్వాలని, కుదరకపోతే వచ్చేసారైనా ఇస్తామనే హామీ ఇవ్వాలని మంత్రి హరీశ్ ముందు ఆయన  డిమాండ్ పెట్టినట్టు తెలిసింది. ఈ విషయం తన చేతిలో లేదని హరీశ్ చెప్పినట్లు సమాచారం.