భయాందోళనలో టూరిస్టులు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన

భయాందోళనలో టూరిస్టులు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు కారణంగా స్థానికులు, టూరిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం మనాలి–-లేహ్ హైవే, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో రోహ్​తంగ్‌ అటల్ టన్నెల్‌లో సుమారు 400 వెహికల్స్ చిక్కుకుపోయాయి. దీంతో అందులోని టూరిస్టులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు12 గంటలు శ్రమించి టన్నెల్‌లో చిక్కుకున్న వెహికల్స్ అన్నింటిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు.

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాంతో టూరిస్టులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆపదలో ఉన్న టూరిస్టులకు ఆహారం ఏర్పాటు చేసినట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్ సుమిత్ ఖిమ్తా తెలిపారు. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోయిందని టూరిస్టులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా కులు, మనాలి, లాహౌల్ స్పితిలకు వారం రోజులుగా రద్దీ పెరిగిందని.. హైవేలపై తరచూ ట్రాఫిక్ జామ్‌ అవుతోందని చెప్పారు.