నాగ్‌పూర్‌లో 7 రోజులపాటు లాక్‌డౌన్

నాగ్‌పూర్‌లో 7 రోజులపాటు లాక్‌డౌన్
  • కరోనాపై మహారాష్ట్ర కఠిన చర్యలు..
  •  కంట్రోల్ చేసేందు‌కు మరిన్ని కొత్త రూల్స్
  • ప్రైవేటు కంపెనీలకు 7రోజులపాటు సెలవు
  • ప్రభుత్వ ఆఫీసుల్లో 25శాతం సిబ్బందితోనే పని

ముంబై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. నాగ్ పూర్ లో ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టింది. దీంతో నాగ్ పూర్ రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. అన్ని ప్రైవేట్ కంపెనీలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 25 శాతం సిబ్బంది మాత్రమే పని చేయనున్నారు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు అధికారులు. నాగ్ పూర్ లో కర్ఫ్యూ అమలు చేసేందుకు మొత్తం 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. మరోవైపు లాతూర్ లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. వారాంతపు మార్కెట్లను మార్చి 31 వరకు రద్దు చేశారు. ఔరంగాబాద్,పర్బని, ఒస్మానాబాద్, పూణే, నాందేడ్, థానే, పాల్ఘర్, జాల్ గావ్, నాసిక్ లో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొన్నిరోజులుగా రోజుకు 15 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,620 కేసులు నమోదయ్యాయి. దీంతో మరిన్ని ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు ముంబై సహా చాలా ప్రాంతాల్లో మంగళవారం నుంచి కొత్త రిస్ట్రిక్షన్లు విధించాలని యోచిస్తోంది. ఆఫీసులు, వ్యాపారాలకు కొత్త అటెండెన్స్ రూల్స్, మతపరమైన ప్రాంతాల్లో క్రౌడ్ కంట్రోల్, సోషల్ ఈవెంట్స్కు ఫ్రెష్ రూల్స్ తీసుకురానుంది. కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించనుంది. రాష్ట్ర కరోనా టాస్క్ఫోర్స్ కీలక సభ్యులు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, సీఎస్ సీతారాం కుంటేతో 16న సీఎం ఉద్ధవ్ థాక్రేచర్చలు జరపనున్నారు. మైక్రో లాక్డౌన్, కంటెయిన్మెంట్ జోన్లకు సంబంధించి కొత్త రూల్స్ను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ముంబై, పుణె, నాగ్పూర్, నాసిక్, థానే జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

గైడ్ లైన్స్ పాటించాలె..
కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న సమయంలో  ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా గైడ్లైన్స్ పాటించాలని ఉద్ధవ్ థాక్రే కోరారు. షాపింగ్ మాల్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు రానీయొద్దు. ఇదే చివరి హెచ్చరిక అనుకోండి. కరోనా గైడ్లైన్స్ తప్పకుండా పాటించండి. సెల్ఫ్ డిసిప్లిన్కి, ఆంక్షలకు తేడా ఉందని తెలుసుకోండి. లాక్డౌన్ పెట్టడానికి మహారాష్ట్ర సర్కారు సుముఖంగా లేదు. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలందరూ సహకరించాలి. పోయిన ఏడాది అక్టోబరు నుంచి అన్లాక్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా చోట్ల ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. జాగ్రత్తలు పాటించట్లేదు. అందుకే కేసులు మళ్లీ పెరుగుతున్నాయి’ అని చెప్పారు. కాగా, కేంద్ర బృందం పోయిన వారం ముంబైలో పర్యటించింది. ప్రజలతోపాటు, షాపింగ్ మాల్స్, బిజినెస్ జరిగే ప్రాంతాల్లో గైడ్లైన్స్ ఎవరూ పాటించడంలేదని రాష్ట్ర సర్కారును హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో కరోనా నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని కేంద్ర బృందం సూచించింది.

ఇది రెడీ మేడ్ కరోనా
చైనాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించి.. మహమ్మారిలా పట్టి పీడిస్తున్న కరోనా మామూలు వైరస్ కాదట. అది ఒక మనిషి నుంచి మరో మనిషికి బాగా వ్యాపించేలా ముందే మార్పులు చేసుకుని మరీ వచ్చిందట. ‘‘సాధారణంగా ఏ వైరస్ అయినా ప్రైమరీ హోస్ట్ ల నుంచి మనుషులకు అంటుకున్న తర్వాత ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ మనుగడ సాగించేందుకు చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా పాకిన కరోనా మాత్రం.. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపించేలా ముందే స్పైక్ ప్రొటీన్లో మార్పులు చేసుకుని వచ్చింది. ఇది ‘రెడీ మేడ్’ కరోనా వైరస్..’’ అని స్కాట్లాండ్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్’ సైంటిస్టులు వెల్లడించారు. స్టడీలో భాగంగా వీరు సార్స్ కరోనా వైరస్–2కు సంబంధించిన వేలాది జీనోమ్ సీక్వెన్స్లను అధ్యయనం చేశారు. దీంతో గబ్బిలాల్లో దొరికిన కరోనా వైరస్ను, మనుషుల్లో బయటపడిన కరోనాను పోల్చి చూస్తే జెనెటికల్గా చాలా స్వల్ప మార్పులు (మ్యుటేషన్లు) మాత్రమే ఉన్నాయని గుర్తించారు. 

త్వరగా టీకాలు వెయ్యాలె..   
కరోనా వైరస్ మనుషులకు సోకకముందు గబ్బిలాల్లో ఉన్నప్పుడే డీ614జీ మ్యుటేషన్, స్పైక్ ప్రొటీన్ లో కొన్ని మ్యుటేషన్లు జరిగాయని, దీంతో వైరస్ బయాలజీ మొత్తం మారిపోయిందని సైంటిస్టులు తేల్చారు. ఈ మ్యుటేషన్ల వల్లే ఈ కరోనా మనుషులకు వేగంగా వ్యాపిస్తూ ప్రపంచమంతా వ్యాపించగలిగిందని అంచనా వేశారు. వ్యాక్సిన్ లు తీసుకోకున్నా ఈ కరోనాకు చాలా మంది ఇమ్యూన్ సిస్టం రెస్పాండ్ అవుతోందని, అయితే భవిష్యత్తులో దీనికి మరిన్ని మ్యుటేషన్లు జరిగి కొత్త కొత్త స్ట్రెయిన్లు వస్తుంటే మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్లు వేయడం ద్వారానే కరోనాను ఖతం చేయొచ్చని సైంటిస్టులు స్పష్టం చేశారు.

తమిళనాడులో 55 మంది స్కూల్ అమ్మాయిలకు కరోనా
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమ్మపెట్టయ్ టౌన్లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లో 55 మంది అమ్మాయిలు వైరస్ బారిన పడ్డారు. ఓ టీచర్కు కూడా కరోనా సోకింది. గత వారం ఓ అమ్మాయికి జలుబు, జ్వరంగా ఉంటే టెస్టు చేశారని.. కరోనాగా తేలిందని అధికారులు చెప్పారు. దీంతో ఆ అమ్మాయి చదువుకుంటున్న స్కూలులోని 1,100 మందికి టెస్టు చేయగా మరో 56 మందికి వైరస్ సోకినట్టు తేలిం దన్నారు. వాళ్లల్లో అందరూ 9 నుంచి 12 తరగతి చదువుతున్నఅమ్మాయిలేనని.. ఎవరికీ లక్షణాల్లేవని చెప్పారు. వీళ్లలో 17 మందిని తంజావూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించగా.. మిగిలిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.