మహారాష్ట్రలోని మరో రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌

మహారాష్ట్రలోని మరో రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌
  • అకోలా, పర్భణిల్లో మూడ్రోజులపాటు అమలు
  • పుణెలో నైట్‌ కర్ఫ్యూ.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌
  • ముంబైలోని అపార్టుమెంట్లు, పెద్ద బిల్డింగుల్లోనే 90% కేసులు
  • దేశంలో ఒక్కరోజే 23,285 కేసులు నమోదు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువవుతుండటంతో లాక్‌‌డౌన్‌‌ పెడుతున్న జిల్లాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నాగ్‌‌పూర్‌‌లో లాక్‌‌డౌన్‌‌ పెడుతున్నట్టు ప్రకటించగా తాజాగా మరో రెండు జిల్లాల్లోనూ లాక్‌‌డౌన్‌‌ విధించారు. అకోలా, పర్భణిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు మూడు రోజులు లాక్‌‌డౌన్‌‌ పెట్టారు. అకోలాలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు, పర్భణిలో శుక్రవారం రాత్రి 12 నుంచి ఈ నెల 15న ఉదయం 6 గంటల వరకు లాక్‌‌డౌన్‌‌ అమలు చేయనున్నారు. నాగ్‌‌పూర్‌‌లో ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్‌‌డౌన్‌‌ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 

పుణెలో కఠిన ఆంక్షలు
పుణెలో స్కూళ్లు, కాలేజీలను ఈ నెల 31 వరకు మూసేయనున్నట్టు ఆ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంచాలని, 50 శాతం కెపాసిటీతోనే నడపాలని చెప్పింది. రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. షాపింగ్‌‌ మాల్స్‌‌, మార్కెట్లు, సినిమా థియేటర్లకు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఉండదన్నారు. వివాహాలు, అంత్యక్రియలు లాంటి కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదన్నారు. ఈ నిబంధనలన్నీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు. 10, 12 తరగతుల ఎగ్జామ్స్‌‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తామన్నారు. పుణెలో 18 ఏండ్ల పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు అనుమతికోసం కేంద్రానికి జిల్లా యంత్రాంగం లెటర్‌‌ రాసింది. 

ముంబై పెద్ద బిల్డింగుల్లోనే 90% కేసులు
ముంబైలో గత రెండు నెలల్లో నమోదైన మొత్తం కేసుల్లో 90% పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్‌‌మెంట్లలోనివేనని ముంబై మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ వెల్లడించింది. మిగిలిన 10% మంది స్లమ్స్‌‌, ఇతర చిన్న చిన్న అపార్ట్‌‌మెంట్లలో రికార్డయ్యాయని చెప్పింది. ఈ నెలలో స్లమ్స్‌‌లోనూ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. సిటీలో ఇప్పటివరకు 27 కంటామినేటెడ్‌‌ జోన్లు ఉన్నాయని, 228 బిల్డింగులకు సీల్స్‌‌ వేశామని వెల్లడించింది. వీటన్నింటిలో కలిపి 7.46 లక్షల మంది ఉంటున్నారని చెప్పింది.

మహారాష్ట్రలో లక్షకుపైగా యాక్టివ్‌‌ కేసులు
దేశంలో గత 6 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 23,285 కేసులు రికార్డవగా ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 14,317 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 2,133, పంజాబ్‌‌లో 1,305 కేసులు బయటపడ్డాయి. ఈ వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో 71 శాతం మహారాష్ట్ర, కేరళల్లోనే ఉన్నాయంది. ఇప్పటివరకు 2.61 కోట్ల మందికి వ్యాక్సిన్‌‌ వేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.13 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 117 మంది మరణించగా ఇప్పటివరకు 1.58 లక్షల మంది చనిపోయారు. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్‌‌ కేసులున్నాయి.