రోడ్డు ప‌క్క‌నే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వ‌ల‌స కార్మికురాలు

రోడ్డు ప‌క్క‌నే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వ‌ల‌స కార్మికురాలు

బర్వానీ: రోడ్డు ప‌క్క‌నే పండండి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది ఓ మ‌హిళ. మ‌ద‌ర్స్ డే రోజునే ఇలా క‌ష్టాల‌తో కూడిన కాన్పు జ‌రిగిన సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో జ‌రిగింది. లాక్ డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మికులు న‌డ‌క‌దారిలో ఇంటిబాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇంటికి చేరుకోవాలన్న తపనతో నడుస్తూ బయల్దేరింది గ‌ర్భిణీ. మధ్యప్రదేశ్ లోని సాత్నాకు చెందిన శకుంతల (30) నిండు గర్భిణీ. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి సాత్నాకు తన కుటుంబంతో బయల్దేరింది.

దాదాపు 210 కిలో మీటర్లు నడిచి ధులే గ్రామానికి చేరుకోగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెతో పాటు ఉన్న మహిళలు ఆమెను రోడ్డు పక్కనే చీరలతో కట్టిన గుడిసెలోకి తీసుకెళ్లి ప్రసవానికి సాయపడ్డారు. అక్కడ ఆమె ఓ మ‌గ‌ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకొన్న బర్వానీ పట్టణ అధికారులు.. ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపి వారు వెళ్లేందుకు బస్సును ఏర్పాటు చేశారు. త‌ల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే ఈ సంఘ‌ట‌న‌పై స్థానికులు సీరియ‌స్ అవుతున్నారు. ఒక నిండు గ‌ర్భిణీ.. అందులోనూ మండు ఎండ‌లో కాలిన‌డ‌క‌న న‌డుచుకుంటూ రావ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.