బయటకు వచ్చారా.. డైరెక్ట్‌‌‌గా ఐసోలేషన్‌ సెంటర్‌‌కే 

బయటకు వచ్చారా.. డైరెక్ట్‌‌‌గా ఐసోలేషన్‌ సెంటర్‌‌కే 

పెద్దపల్లి: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పెట్టిన లాక్‌‌డౌన్‌‌‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుతున్న వారి భరతం పడుతున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బయట తిరుగుతున్న ఆకతాయిలను రామగుండం కమిషనరేట్ పోలీసులు బలవంతంగా ఐసోలేషన్ సెంటర్‌‌కు తరలిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 5 లారీలను ఏర్పాటు చేశారు. 

పెద్దపల్లిలో లాక్‌‌డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఐజీ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం రామగుండం సీపీ సత్యనారాయణతో కలసి పెద్దపల్లిలో అమలవుతున్న లాక్ డౌన్‌‌ను నాగిరెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డుతోపాటు కూరగాయల మార్కెట్‌‌‌ను సందర్శించారు. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉందని పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని ఆయన అభినందించారు. 

సడలింపు సమయం అనంతరం ప్రజలెవరూ బయటకు రావొద్దని నాగిరెడ్డి కోరారు. లాక్‌‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అనుమతి లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌‌తోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.