నిజామాబాద్ సిటీలోని రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ

నిజామాబాద్ సిటీలోని రిటైర్డ్  అడిషనల్  కలెక్టర్ ఇంట్లో చోరీ
  •     25 తులాల బంగారం, కిలో వెండితో ఉన్న లాకర్​ ఎత్తుకెళ్లిన దొంగలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ సిటీలోని సుభాష్​నగర్​ ఏరియాలో రిటైర్డ్​ అడిషనల్​ కలెక్టర్​ రవికుమార్​ ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి ఉన్న లాకర్​ను ఎత్తుకెళ్లారు. లాకర్​లో 25 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు, కొంత నగదు ఉంది. త్రీ టౌన్​ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన రవికుమార్  అడిషనల్​ కలెక్టర్​గా పని చేసి మూడేండ్ల కింద రిటైర్​ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్​లో ఉంటున్న ఆయన నెలకోసారి ఫ్యామిలీతో వచ్చి వెళ్తుంటారు. ఇల్లు క్లీన్​ చేసేందుకు పని మనిషిని ఏర్పాటు చేయగా, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వచ్చి వెళ్తోంది. 

లాక్​ వేసిన ఇంట్లోకి మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వచ్చిన దొంగలు లాకర్​ తెరుచుకోకపోవడంతో దానికి వెంట తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పని మనిషి వచ్చి డోర్లు తెరిచి ఉండడంతో రవికుమార్​కు తెలియజేసింది. ఆయన ఫోన్​లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని సీసీ కెమెరా డీవీఆర్​ను దొంగలు తీసుకెళ్లగా, కాలనీలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముఖానికి ముసుగు ధరించిన ముగ్గురు దొంగలు బైక్​పై వచ్చినట్లు గుర్తించారు. లాకర్​ను దొంగలు ఎక్కడికి పట్టుకెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సిటీ శివారులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.