పార్లమెంట్ లో మణిపూర్ ఘటనపై ప్రకంపనలు..

పార్లమెంట్ లో మణిపూర్ ఘటనపై ప్రకంపనలు..

న్యూఢిల్లీ, వెలుగు: మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలంటూ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా నిరసన చేపట్టాయి. మణిపూర్ వ్యవహారంపై సభలోని రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ఇటు లోక్​సభ స్పీకర్, అటు రాజ్యసభ చైర్మన్ అంగీకరించినా.. అపోజిషన్ పార్టీలు మాత్రం మోదీ సమక్షంలో రూల్ 267 కింద దీర్ఘ కాలిక చర్చ జరపాలని పట్టుబట్టాయి. ఆందోళనల కారణంగా సెషన్ ముందుకు సాగకపోవడంతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. దీనికి ముందు.. సభ కార్యకలాపాలు చూసేందుకు వచ్చిన మలావి పార్లమెంటరీ ప్రతినిధుల బృందానికి స్పీకర్ ఓం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ స్పీచ్ పూర్తవ్వగానే అపోజిషన్ పార్టీ లీడర్లు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. ప్లకార్డులతో వెల్​లోకి దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా, స్పీకర్ మాత్రం క్వశ్చన్ హవర్ కొనసాగించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 

ప్రతిపక్షాలే పారిపోతున్నయ్

తిరిగి సభ ప్రారంభమయ్యాక హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతిపక్షాలే పారిపోతున్నాయని విమర్శించారు. చర్చ సందర్భంగా ఎవరు సమాధానం ఇవ్వాలనేది అపోజిషన్ పార్టీలు ఎలా డిసైడ్ చేస్తాయని స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. ఆందోళనల మధ్యే లోక్​సభలో సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు–2023 ఆమోదం పొందింది. తర్వాత కూడా నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పెద్దల సభలోనూ నిరసనలు

ఉదయం 11 గంటలకు సెషన్ ప్రారంభమైన తర్వాత.. రూల్ 267 కింద 55 నోటీసులు అందాయని చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ ప్రకటించారు. లీడర్ ఆఫ్ ది హౌజ్ పీయూష్ గోయల్ మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడారు. రూల్ 176 కింద మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే చర్చ నుంచి పారిపోతున్నాయని విమర్శించారు. 

ప్రతిపక్షాలది రాజకీయ సమస్యే: నిర్మల

ప్రతిపక్షాలకు మణిపూర్ అంశం రాజకీయ సమస్య మాత్రమేనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాల తీరుపై ఆమె మండిపడ్డారు. మణిపూర్ అంశంపై చర్చలో పాల్గొనేందుకు ప్రతిపక్షాలకు ఇష్టం లేనట్లుందని, అందుకే సోమవారం సభలో ఈ విషయం చర్చకు రాగానే ప్రతిపక్ష నేతలు పారిపోయాయని కేంద్ర మంత్రి విమర్శించారు.

రాజ్యసభ నాలుగు సార్లు వాయిదా

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాల ఆందోళనతో చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ రాజ్య సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ్యులు నినాదాలు చేయడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక మణిపూర్ అల్లర్లపై స్వల్పకాలిక చర్చకు చైర్మన్ పర్మిషన్ ఇచ్చారు. అంతలోనే.. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కల్పించుకుని రూల్ 267 కింద ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో దీర్ఘ కాలిక చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో నిరసనలు వ్యక్తం కావడంతో సభను చైర్మన్​ మరోమారు 3:30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్​ సభను మంగళవారానికి వాయిదా వేశారు.