
స
హైదరాబాద్: ఆరు నెలల గ్యాప్‌తో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ధన ప్రవాహం పొంగిపొర్లింది. విడతలవారీగా ఓటర్లకు నోట్లు పంచడం దగ్గర్నుంచి అభ్యర్థుల ప్రచారం, రవాణా ఇతరత్రా కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సుమారు రూ.5,450 కోట్లు ఖర్చుచేశాయి. ఎన్నికల వ్యయంపై పరిశోధన చేసిన ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంస్)’ తన తాజా రిపోర్టులో ఈ విషయాల్ని వెల్లడించింది. ‘తెలంగాణ కేస్’ పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపర్చిన సీఎంఎస్.. ఇక్కడి చేవెళ్ల, మల్కాజ్గిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాలను దేశంలోనే ఎక్కువ ఖర్చు జరిగిన సెగ్మెంట్ల జాబితాలో చేర్చింది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు రూ.9వేల కోట్లు కుమ్మరించాయని అంచనా వేసింది.
అసెంబ్లీకి ఎక్కువ.. లోక్‌సభకు తక్కువ ..
దేశవ్యాప్తంగా ఒక్కో లోక్‌సభ సీటులో సగటున వ్యయం రూ.100 కోట్లుగా అంచనా వేసిన సీఎంఎస్, తెలంగాణలోని 17 స్థానాలు కలిపి మొత్తం రూ.450 కోట్లు ఖర్చయినట్లు పేర్కొంది. అందులో 20 నుంచి 25 శాతం డబ్బును ఓటర్లకు పంచగా, మిగతాది అభ్యర్థుల ప్రచారానికి, ఇతర ఖర్చులకు వాడారని రిపోర్టులో చెప్పారు. ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఫలితాలు ఏకపక్షంగా రావడం, లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందన్న అంచనాలతో అభ్యర్థులు, పార్టీల్లో ఆసక్తి తగ్గిందని, ఆమేరకు ఖర్చు కూడా తగ్గిందని, టీడీపీ పోటీ చేయకపోవడం ఖర్చు తగ్గడానికి మరో కారణమనీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు కలిపి పార్టీలు రూ.5వేల కోట్లు ఖర్చు చేశాయి. ఓటర్లకు విడతలవారీగా డబ్బులు పంచిన పార్టీలు, కొన్ని చోట్ల విహారయాత్రల ప్యాకేజీ కూడా ఇచ్చినట్లు సీఎంఎస్ గుర్తించింది. ఎంపిక చేసుకున్న అసెంబ్లీ/లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియను దగ్గర్నుంచి పరిశీలించి, రకరకాల డేటాలు, మీడియా వార్తల్నీ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ రూపొందించినట్లు సీఎంఎస్ నిర్వాహకులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.68 కోట్ల అక్రమ సొత్తును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 60 కోట్ల క్యాష్, 5కోట్ల విలువైన మద్యం, 3కోట్ల విలువై డ్రగ్స్ ఉన్నాయని సీఎంస్ రిపోర్టులో గుర్తుచేశారు.
ఆ మూడు స్థానాల్లో అదిరిపోయేలా…
రాష్ట్రంలోని చేవెళ్ల, మల్కాజ్గిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో పార్టీలు పోటీపడి ఖర్చు చేశాయని, దేశంలోనే ఎక్కువ ఖర్చు జరిగిన సెగ్మెంట్ల జాబితాలో ఈ మూడు సెగ్మెంట్లు ఉన్నాయని సీఎంఎస్ తెలిపింది. ఈ మూడు స్థానాల్లో ఓటర్లకు డబ్బులు పంచడానికి పార్టీలు ఏజెన్సీలనే నియమించుకున్నట్లు వెల్లడైంది. గ్రూపుల వారీగా ఓటర్లను విహార, తీర్థ యాత్రలకు, కొంతమందిని విదేశాలకూ పంపినట్లు సీఎంఎస్ పేర్కొంది.
ఏపీలో ఓటుకు పింకు నోటు…
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు రూ.9వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్ అంచనా వేసింది. ఇందులో అభ్యర్థులు టికెట్ తెచ్చుకోవడానికి వెచ్చించిన మొత్తాన్ని కలపలేదని చెప్పింది. 175 అసెంబ్లీ స్థానాలుండగా, సగం చోట్ల (దాదాపు 80 సెగ్మెంట్లలో) అభ్యర్థులే ఓటర్లకు డబ్బులు పంచినట్లు తేలింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కో ఓటరుకు సగటున రూ.2 వేలు పంచారని, చాలా చోట్ల ఓటర్లకు రెండు పార్టీల నుంచి డబ్బులు ముట్టాయని, ముక్కోణపు పోటీ ఉన్న కొన్న స్థానాల్లో మూడు పార్టీల నుంచి ఓటర్లకు డబ్బులు వెళ్లాయని సీఎంస్ రిపోర్టులో వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం మొత్తం రూ.120 కోట్ల క్యాష్, 12కోట్లు విలువ చేసే లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.