లాస్ట్ ఫేజ్ పోలింగ్.. 11 గంటల వరకు 26 శాతం పోలింగ్

లాస్ట్ ఫేజ్ పోలింగ్.. 11 గంటల వరకు 26 శాతం పోలింగ్

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా...ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.03శాతం పోలింగ్ నమోదయినట్లు ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఉదయం 11 గంటల వరకు  హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక పోలింగ్ శాతం నమోదవగా, ఒడిశాలో అత్యల్పంగా నమోదయినట్లు ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్ పోలింగ్ ప్రారంభ గంటలలో  హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఉదయం 11 గంటల  వరకు రాజకీయ పార్టీల నుండి సుమారు 1,450 ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఫిర్యాదుల్లో ఈవీఎం పనిచేయకపోవడం, ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రానీయకుండా ఆపడం, ఓటర్లను బెదిరించడం లేదా పలు  నియోజకవర్గాల్లో ఓటు వేయకుండా ఆపడం వంటివి ఉన్నాయని తెలిపింది. 

ఈ ఆఖరు విడతలో చాలా మంది ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీశ్ తివారి, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్ తో పాటు పలువురు కీలక నేతలు లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బిహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్ లో  4, జార్ఖండ్ లో 3, చండీగడ్ లోక్ సభ సెగ్మెంట్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. 

ఆఖరు విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు. మొత్తం 10  కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందుకోసం 1 లక్షకు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజ్లలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడో సారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. బిహార్ లోని పాట్న సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్  మండి లోక్ సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. 

పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్   రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో ఒక వెయ్యి ఒక వంద  కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.