
దేశవ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ అధికారుల వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీలో 34.37 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.23 శాతం, బీహార్‌లో 36.48 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 54.80 శాతం, ఒడిశాలో 35.69 శాతం, జార్ఖండ్‌లో 42.54 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 35.22 శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లోని 14 సీట్లు, హర్యానాలోని మొత్తం 10 సీట్లు, ఢిల్లీలో ఏడు సీట్లు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది సీట్లు, ఒడిశాలో 6 సీట్లు, జార్ఖండ్‌లో 4 సీట్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ 58 స్థానాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూ కట్టారు. కాగా ఏడోదశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.