సరైన సమయంలో కాశ్మీర్​ ‘రాష్ట్రం‘

సరైన సమయంలో కాశ్మీర్​ ‘రాష్ట్రం‘
  •     జమ్మూకాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
  •     వ్యతిరేకించిన కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ
  •     సపోర్ట్ చేసిన బీఎస్పీ, వైఎస్సార్​సీపీ, జేడీయూ

న్యూఢిల్లీజమ్మూకాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్​మెంట్) బిల్లు–2021కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. వాయిస్ ఓటు ద్వారా ఈ బిల్లును లోక్​సభ పాస్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్ సర్వీసెస్ కేడర్‌లో జమ్మూకాశ్మీర్ కేడర్ సివిల్ సర్వీసెస్ అధికారులను విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో సవరణ బిల్లును శనివారం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీలు వ్యతిరేకించగా.. బీఎస్పీ, వైఎస్సార్​సీపీ, జేడీయూ తదితర పార్టీలు సపోర్ట్ చేశాయి. ఈ బిల్లును రాజ్యసభ గతంలోనే ఆమోదించింది.

కాశ్మీర్ అభివృద్ధే టాప్ ప్రయారిటీ

2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఎంతో చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొన్ని తరాలపాటు పాలన సాగించిన వారికంటే ఎక్కువే చేశామన్నారు. కాశ్మీర్ అభివృద్ధి తమకు టాప్ ప్రయారిటీ అని చెప్పారు. కాశ్మీర్​కు మళ్లీ రాష్ట్ర హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా కొత్త చట్టంలో మార్పులు చేశారంటూ అపొజిషన్ మెంబర్లు ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఈ సవరణ చట్టంలో రాష్ట్ర హోదా అంశం గురించి ఏమీ పేర్కొనలేదని చెప్పారు. సరైన సమయంలో జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాశ్మీర్​కు కేంద్ర పాలిత ప్రాంత హోదా తాత్కాలికమేనన్నారు. స్థానికంగా అభివృద్ధి కోసం పంచాయతీలకు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ పవర్స్ ఇచ్చామని వెల్లడించారు. ఇప్పుడు కాశ్మీర్​లో ప్రజలు ఎన్నుకున్న వాళ్లే పాలన సాగిస్తారని, రాజులు, రాణులు కాదని కామెంట్ చేశారు. జమ్మూకాశ్మీర్​లో ఏ ఒక్కరూ భూమి కోల్పోరని, అభివృద్ధి పనులకు కావాల్సినంత భూమి ఉందని చెప్పారు.

రాజకీయం చేయొద్దు

జమ్మూకాశ్మీర్, లడాఖ్ అంశాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు అమిత్ షా సూచించారు. ‘‘మీకు పొలిటికల్ ఫైట్ కావాలంటే.. బరిలోకి రండి. చూసుకుందాం. ఇక్కడ ఎవరూ భయపడరు. ఇది (కాశ్మీర్, లడాఖ్) దేశంలోనే సున్నితమైన ప్రాంతం. వాళ్లు గాయపడ్డారు. వాళ్లకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వారిని ఓదార్చడం ఈ సభ బాధ్యత. వారి గాయాలను ఇంకా పెద్దవి చేయకండి” అని కోరారు. బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్​ను అభివృద్ధి దారిలోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్​లో 170 కేంద్ర చట్టాలు అమలవుతున్నాయని చెప్పారు.

ఐదు రాష్ట్రాలకు 3,113 కోట్లు

గతేడాది ప్రకృతి విపత్తులు, మిడతల దాడితో నష్టపోయిన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.3,113 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని హై లెవెల్ కమిటీ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్​ను అప్రూవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్​మెంట్ ఫండ్ కింద ఈ నిధులు కేటాయించారు. మధ్యప్రదేశ్​కు 1,280.18 కోట్లు, ఆంధ్రప్రదేశ్​కు 280.78 కోట్లు, బీహార్​కు 1,255.27 కోట్లు, తమిళనాడుకు 286.91 కోట్లు, పుదుచ్చేరికి 9.91 కోట్లు మంజూరు చేశారు.

మార్చి 8 వరకు లోక్సభ వాయిదా

తొలిదశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగిశాయి. మార్చి 8 వరకు లోక్ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగం, ఆ స్పీచ్​పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ ప్రవేశపెట్టడం.. వంటివి ఫస్ట్ ఫేజ్​లో ముగిశాయి. సెకండ్ ఫేజ్​లో ఫైనాన్స్ బిల్లు, గ్రాంట్లకు సంబంధించిన డిమాండ్లను పాస్ చేస్తారు. ఏప్రిల్ 8న రెండో దశ సమావేశాలు ముగుస్తాయి.