బెంగుళూర్: కర్నాటకలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి ధార్వాడ్ జిల్లాలోని అన్నీగేరి సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక మంటల్లో సజీవ దహనమయ్యాడు. మృతుడిని లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ సలీమత్గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హవేరికి చెందిన సలీమత్ లోకాయుక్త ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 5) రాత్రి కారులో ఒంటరిగా ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో అన్నీగేరి సమీపంలో సలీమత్ ప్రయాణిస్తోన్న కారు జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అప్పటికే డోర్లు లాక్ కావడం, గాయపడి ఉండటంతో సలీమత్ కారులో నుంచి బయటకు రాలేక మంటల్లో సజీవ దహనమయ్యాడు.
►ALSO READ | ఇండిగో ఫ్లైట్ రద్దయిందా.. డోంట్ వర్రీ.. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నయ్ !
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కానీ అప్పటికే కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్నీగేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాల ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక మద్యం మత్తు, ఓవర్ స్పీడ్ వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకుందా అని ఎంక్వైరీ చేస్తున్నారు.
