సీమ కన్నీళ్లు తుడుస్తా.. పాదయాత్రలో లోకేశ్ 

 సీమ కన్నీళ్లు తుడుస్తా.. పాదయాత్రలో లోకేశ్ 

తాను రాయలసీమ కష్టాలు చూశానని.. సీమ కన్నీళ్లు తుడుస్తానని యువగళం పాదయాత్రలో  నారా లోకేశ్ అన్నారు. మిషన్ రాయలసీమలో భాగంగా తాము అధికారంలోకి వస్తే సీమకు ఏం చేస్తామనే దానిపై ఆయన హామీలు ఇచ్చారు. హార్టి కల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దుతామని తెలిపారు. సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం తమ లక్ష్యమని చెప్పారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని.. వివిధ హర్టికల్చర్ పంటలకు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎక్స్ పోర్ట్ చేసే విధంగా కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

పాత భీమా పథకాన్ని అమలు చేయడం.. రైతు బజార్లు పెంపు కోసం పని చేస్తామని.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి అనే దానిపై ప్రభుత్వం నుండే సలహాలు ఇస్తామని.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ అన్నారు. మిర్చి, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సాయం అందిస్తామని నారా లోకేశ్ అన్నారు

టొమాటో వాల్యూ చైన్ ఏర్పాటు చేస్తామని.. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిచడానికి కృషి చేస్తామని నారా లోకేశ్ అన్నారు. వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపిలో తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకి అందిస్తామని వివరించారు. సీడ్ హబ్ గా ఏపీని మారుస్తామని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని నారా లోకేశ్ అన్నారు.